village poet Ramesh Karthik: నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈ యువకుడు చిన్నప్పటి నుంచి కవితాలు, పుస్తకాలు రాయడం అంటే మక్కువ కనబరిచాడు. కళాశాలోనే పలు పుస్తకాలు రచించాడు. సమాజాన్ని చైతన్యపరిచేలా రాసిన ఆ రచనలే రెండు తెలుగు రాష్ట్రాల విశ్వవిద్యాలయాల్లో పాఠాలుగా మారాయి. బల్దేర్ బండి అనే పుస్తకానికి ఎంతో మంది రచయిత్రుల ప్రశంసలు, అవార్డులు అందుకున్నాడు ఈ యువకుడు.
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం వివేక్‌నగర్ తండాకు చెందిన కార్తీక్ నాయక్ ది చిన్న రైతు కుటుంబం. తండ్రి గల్ఫ్‌లో 15 ఏళ్ల పాటు కార్మికుడిగా పనిచేయగా.. తల్లి పొలంలో కూరగాయలు పండించి రోడ్డు పక్కన వాటిని విక్రయించేది. వీరికి ముగ్గురు సంతానం.. వారిలో పెద్దవాడే ఈ యువకుడు. చదువుల్లో చురుగ్గా ఉండే కార్తీక్ గురువుల ప్రోత్సాహంతో 10 తరగతిలోనే మెల్లగా కవితలు, కథలు రాయటం ఆరంభించాడు.
కవితలు, స్ఫూర్తివంతమైన కథలు రాయడంతో ఉపాధ్యాయిల నుంచి ప్రశంసలు అందుకున్నాడు కార్తీక్. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగం కోసం పాలిటెక్నిక్ చదివించారు. అయితే పేరుకు మాత్రమే డిప్లొమా చదివాడు. మనసంతా సాహిత్యం మీదే ఉండేది. దాంతో గ్రంథాలయలకు వెళ్లి పుస్తకం పాఠాణం చేసేవాడిని అంటున్నాడు ఈ యువకుడు. ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూనే అభిరుచి మేరకు మళ్లీ కవితలు రాయటం మొదలు పెట్టాడు కార్తీక్.
విశ్వవిద్యాలయాల్లో ఈయన పుస్తకాలు పాఠాలుగా: అలా రాసిన పుస్తకమే బల్దేర్ బండి. దాని గురించి తెలుసుకున్న సాహితీప్రియులు కవితా సంపుటిగా తీసుకొచ్చేందుకు సహకరించారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఆ పుస్తకంఆవిష్కరించారు. 136 పేజీల్లో 50 కవితలతో అందుబాటులోకి వచ్చింది . ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయల పాఠ్యాంశాలుగా చేరింది ఆ పుస్తకం.
ఒకవైపు చదువులు కొనసాగిస్తూనే, మరోవైపు తనకు ఇష్టమైన సాహిత్యంలో రాణించేందుకు రమేష్ కార్తీక్ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. డిప్లొమా కోర్సును కాదన్నందుకు తల్లిదండ్రుల నుంచి డబ్బు అడగటానికి ఇష్టపడలేదు. ఖర్చుల కోసం తానే సంపాదించుకోసాగాడు. ఇందుకోసం క్యాటరింగ్, కరపత్రాలు పంచటం, జిరాక్స్ కేంద్రాల్లో పని చేశాడు. తల్లిదండ్రుల కోరిక మేరకు ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నంలోనూ ఉన్నాడు ఈ యువకుడు.
ఆంగ్లంలోకి అనువాదం: ఒక్క కవితా సంపుటే కాదు.. గతేడాది రాసిన కథల ఆధారంగా కథా సంపుటి కూడా విడుదలైంది. అందులో గిరిజన తెగల జీవితాల్లో చోటుచేసుకున్న విషాదాలే కథాంశాలుగా రాశాడు. ఇలా 8 కథలు 180 పేజీలతో రాసిన ఢావ్లో పేరిట కథా సంపుటిని గతేడాది ప్రచురించారు. దీన్ని రచయిత్రి వీబీ సౌమ్య ఆంగ్లంలోకి అనువదించారు. పలు కవితాలు స్పానీష్‌లోకి కూడా అనువాదం అయ్యాయి. అంతర్జాతీయ మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి.
బల్దేర్ బండి పుస్తకంతో మంచి గుర్తింపు: బల్దేర్ బండిని కూడా హిందీలో బైల్ గాడీ పేరుతో పీసీ వసంత అనువదించారు. గిరిజన సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం తను చేస్తుంటే అదే సాహిత్యం అతడికి గుర్తింపు తెస్తోంది. ట్రైబల్ అచీవర్ అవార్డుతోపాటు పలు సాహిత్య పురస్కారం అందుకున్నాడు. ఇలాంటి యువకుడు మా బంజారలో ఉండడంతో మాకెంతో ఆనందంగా ఉందంటున్నారు ఈ యువకుడి గ్రామస్థులు.
బల్దేర్ బండి పుస్తకాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సు 5వ సెమిస్టర్లో పాఠ్యాంశంగా చేర్చారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఎంఏ తెలుగు 4వ సెమిస్టర్లో ఈ పుస్తకం మొత్తాన్ని యూనిట్ పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఈ యువకుడి గిరిజన సాహిత్యం పలు ప్రముఖ ఆంగ్ల పత్రికల్లోనూ ప్రచురితమైంది.
"మాది వ్యవసాయం కుటుంబం.. నేను బోధన్‌లో చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు కవితలు రాయడం, బొమ్మలు వేయడం చాలా ఇష్టం. నాకు ఇష్టం లేకుండా తల్లిదండ్రులు డిప్లొమా చదివించారు. అందుకు నేను నిరాకరించాను. డబ్బులు కూడా అడగలేదు. కరపత్రాలు పంచటం, జిరాక్స్ కేంద్రాల్లో పని చేసి ఖర్చులకు డబ్బులు సంపాదించాను. బల్దేర్ బండి పుస్తకం నాకు మంచి గుర్తింపు తెచ్చింది. అది ఏయూ విశ్వవిద్యాలయం వాళ్లు ఎంఏ తెలుగు పాఠ్యాంశంలో ప్రవేశపెట్టారు."- రమేష్ కార్తీక్, యువ రచయిత
ఇవీ చదవండి: