ఎనిమిది పదుల వయసులో ఓ వృద్దురాలు భూమి కోసం పోరాటం చేస్తోంది. తనకు ఆధారమైన భూమి కోసం ఆందోళనకు దిగింది. మరణించిన తన భర్త పేరు మీద నుంచి ఆమె పేరుపైకి మార్చి... న్యాయం చేయాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా బోధన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎనభై ఏళ్ల వృద్ధురాలు ధర్నా చేపట్టింది.
బోధన్ పట్టణం ఆచన్‌పల్లికి చెందిన నీరడి కన్నయ్య గతేడాది మరణించారు. ఆయన పేరున బోధన్‌లోని పాండు తర్ప సర్వే నంబర్ 379/35లో ఇరవై గుంటల భూమి ఉంది. ఆ భూమిని తన పేరున మార్చాలంటూ... ఏడాది కాలంగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగింది. రేపు, మాపు అంటూ ఇంతవరకు పట్టాచేయలేదు. ఎనభై ఏళ్ల వయసులో కార్యాలయాల చుట్టూ తిరగలేకపోతున్నానని సాయమ్మ ఆవేదన చెందుతోంది. ఇక తనకు న్యాయం జరిగే అవకాశం లేక.. కుటుంబసభ్యులతో కలిసి ఉదయం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. వెంటనే తన పేరున భూమి మార్చి తనకు న్యాయం చేయాలని సాయమ్మ కోరుతోంది.
ఏడాది కింద నా భర్త చనిపోయారు. ఆయన పేరు మీద ఉన్న భూమిని నాపేరున పట్టా చేయాలని అప్పటి నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. అటూ, ఇటూ తిప్పుతున్నారు. రేపు, మాపు అంటున్నారు. ఇంతవరకు నా పేరు మీదకు మారలేదు. ఆ తిరగడం నాతోనే కావడం లేదు. చేస్తున్నాం అంటున్నారు కానీ పట్టా చేయడం లేదు. నాకు ఆ భూమే ఆధారం. ఈ వయసులో ఎన్ని సార్లు తిరగాలి? నేను ఎలా బతకాలి? ఇప్పటికైనా నాకు న్యాయం చేయండి సార్.
-సాయమ్మ, బాధితురాలు
మా పెద్దనాన్న భూమి ఎవరి అధీనంలో లేదు. ఎవరూ కబ్జా చేయలేదు. ఆ భూమినే మేమే సాగు చేస్తున్నాం. మా పెద్దమ్మ పేరు మీద పట్టా మార్పిడి చేయాలని అధికారులను కోరాం. ఏడాది నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పటిదాకా పట్టామార్పిడి కాలేదు. ఆ భూమినే ఆమెకు ఆధారం. ఆమె పేరు మీద పట్టా చేసి న్యాయం చేయాలి.
-సాయమ్మ బంధువు
ఇదీ చదవండి: Etv Bharat Effect : కమలమ్మకు కల్యాణలక్ష్మి నగదు వచ్చేసింది..