నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి క్రిటికల్ కేర్ యూనిట్ విభాగాధిపతి కిరణ్ మాదాల, రేడియాలజీ విభాగాధిపతి మధుసూదన్‌రెడ్డి, ఇదే విభాగం సహాయ ఆచార్యుడు సంతోష్ కరోనాపై అధ్యయనం(Research On Corona)లో పాలుపంచుకున్నారు. వీరు ఏప్రిల్ 1-25 మధ్య రెండు డోసుల టీకా తీసుకుని 14 రోజులు దాటిన తర్వాత కొవిడ్ బారిన పడిన 26 మందిని ఒక వర్గంగా, అసలు టీకా తీసుకోని వారిలో వైరస్ సోకిన 180 మందిని మరో వర్గంగా విభజించి పరిశీలించారు. కేస్ కంట్రోల్ స్టడీ నియమం ప్రకారం టీకా తీసుకున్న వారి కంటే వేసుకోని వారిని ఎక్కువ సంఖ్యలో పరిశీలనకు ఎంచుకున్నారు. ఈ రెండు వర్గాల్లో 28-80 ఏళ్ల వయసువారిని పరిగణనలోకి తీసుకున్నారు.
టీకా తీసుకున్న 26 మందికిగాను 25 మందిలో తక్కువ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కరికి మాత్రమే మధ్యస్థ లక్షణాలు ఉన్నట్లు తేల్చారు. సీటీ- ఎస్‌ఎస్ (తీవ్రత స్కోరింగ్) పరిశీలనలో ముగ్గురిలో మాత్రమే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కనిపించింది. అది కూడా స్వల్పంగా 3-7 నమోదైందని తెలిపారు. 23 మందికి ఎలాంటి ఇన్ఫెక్షన్ రాలేదు.
టీకా తీసుకోని 180 మందిలో 160 మంది (89 శాతం) ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు గురైనట్లు గుర్తించారు. వీరిలో 40 శాతం మందిలో తక్కువ తీవ్రత, 70 శాతం మందిలో మధ్యస్థం, 50 శాతం మందిలో ఎక్కువ తీవ్రత ఉన్నట్లుగా తేలింది. సగటున 66 శాతం మందిలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని తేలినట్లు డాక్టర్ కిరణ్ మాదాల తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న నిజామాబాద్‌లో అక్కడి నుంచి వ్యాప్తి చెందిన వేరియంట్ 70 శాతం కేసుల్లో ఉన్నట్లు అంచనా వేశామని ఆయన పేర్కొన్నారు. వీరి అధ్యయన నివేదిక ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ హెల్త్ అండ్ క్లినికల్ రీసెర్చ్’(International journal of health and clinical research)లో ఇటీవల ప్రచురితమైంది.
ఇదీ చూడండి: Agricultural Markets: ఆదాయం ఉన్నచోట అక్రమాలు