సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తోన్న రివాల్వింగ్ ఫండ్ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రివాల్వింగ్ ఫండ్ రూ.50 లక్షల చెక్కులను 16 మహిళా సంఘాలకు పంపిణీ చేశారు.
ప్రభుత్వం మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాలకు అందిస్తోన్న ఫండ్ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కష్టపడి పని చేస్తే మీరే పది మందికి పని కల్పిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా సంఘంలో వంద కంటే ఎక్కువ మంది సభ్యులున్న సంఘానికి రూ.5 లక్షలు, వంద కంటే తక్కువ మంది ఉన్న సభ్యులున్న సంఘానికి రూ.3 లక్షల చొప్పున పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇంఛార్జ్ ఏడీ ఫిషరీస్ దేవేందర్, మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా కో-ఆపరేటివ్ డైరెక్టర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.