నిజామాబాద్ కమిషనరేట్‌లోని రుద్రూర్ సీఐ సూదిరెడ్డి దామోదర్ రెడ్డి వాట్సాప్ సందేశం కలకలం రేపుతోంది. అధికారుల ఒత్తిడి తట్టుకోలేని విధంగా ఉందని... నా సమస్యకు ఆత్మహత్య ఒక్కటే మార్గం అంటూ ఒక సందేశాన్ని అధికారిక వాట్సాప్ గ్రూప్‌లో పంపటం చర్చనీయాంశంగా మారింది. అప్రమత్తమైన కమిషనరేట్ అధికారులు సీఐని సెలవుపై పంపించారు.
అసలేం జరిగింది?
సీఐ దామోదర్ రెడ్డికి బంధువుల సమస్య పరిష్కారంలో భాగంగా... అవతలి వ్యక్తులను బెదిరించారని, అనంతరం సదరు వ్యక్తులు ఐజీకి ఫిర్యాదు చేశారని విశ్వసనీయ సమాచారం. నిజామాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్ రెడ్డి దీనిపై విచారణ జరిపి తుది నివేదికను ఐజీకి అందించటం వల్ల చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదిపాటు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు పొందరాదంటూ నెల 26న ఐజీ స్టీఫెన్ రవీంద్ర మెమో జారీ చేశారు.
డీఎస్పీ పదోన్నతి జాబితాలో సీఐ
1995 బ్యాచ్‌కు చెందిన దామోదర్ రెడ్డి ప్రస్తుతం డీఎస్పీ పదోన్నతి జాబితాలో ఉన్నారు. ఈ సమయంలో ఛార్జి మెమో ఇవ్వటం వల్ల ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. వాట్సాప్ సందేశం నేపథ్యంలో అప్రమత్తమైన కమిషనరేట్ అధికారులు ఈ నెల 27 నుంచి సెలవులపై ఇంటికి పంపారు. ముందు జాగ్రత్తగా ఆయన సర్వీస్ రివాల్వర్‌ను కూడా తీసుకున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి: నేడు ఇంటర్ బోర్డు ముట్టడి, నిరవధిక నిరాహార దీక్ష