పలకా బలపం పట్టాల్సిన చిట్టి చేతులు పలుగు పార పట్టి మట్టి పనులు చేశాయి. బడీడు పిల్లలు బండెడు చాకిరీ చేశారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికబద్దంగా అడుగులువేసింది. ఫలితం వంద శాతం బాల కార్మిక రహిత మండలంగా గుర్తింపు సాధించింది. ఆ మండలమే నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్. రెండు దశాబ్దాల క్రితమే ఈ ఖ్యాతి గడించిన వేల్పూర్ అప్పటి నుంచి అదే బాటలో పయనిస్తోంది.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2001లో ప్రత్యేక కార్యచరణను రూపొందించింది. పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని రెంజల్, ఎడపల్లి, నందిపేట్, వేల్పూర్ మండలాలను ఎంపిక చేశారు. బడి మానేసిన 14 ఏళ్లలోపు పిల్లల వివరాలు సేకరించారు. వేల్పూర్ మండలంలో 398మంది బాల కార్మికులను అధికారులు గుర్తించారు. వారందరినీ చేరదీసి.. తల్లిదండ్రులకు, వారిని పనిలో పెట్టుకున్న యజమానులకు అవగాహన కల్పించారు. వేల్పూర్‌లో బ్రిడ్జి స్కూల్లో చేర్పించి వారిని మళ్లీ అక్షర బాటపట్టించారు. ఇటీవల జాతీయ బృందం వేల్పూర్‌లో పర్యటించింది. మండలంలో బాల కార్మికులు లేకుండా కృషి చేసిన నాటి ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, అధికారులను సన్మానించారు. అప్పటి జిల్లా కలెక్టర్, ప్రస్తుత కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అశోక్ కుమార్ జిల్లాకు వచ్చారు. 20 ఏళ్ల క్రితం తమ కృషికి దక్కిన ఫలితాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు.
పనుల నుంచి విముక్తి కల్పించిన తర్వాత మళ్లీ పనులకు వెళ్లకుండా అధికారుల యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరించింది. గ్రామీణాభివృద్ధి కమిటీలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అన్ని గ్రామాల్లో వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు, పశుపోషకులతో అవగాహన సమావేశం నిర్వహించారు. పిల్లలను పనిలో చేర్చుకుంటే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. వేల్పూర్ మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో వందశాతం విద్యార్థులను నమోదు చేయించారు. నిరంతర పర్యవేక్షణ కొనసాగించారు. ఇదే ఒరవడిని ఎన్నేళ్లైనా కొనసాగిస్తామని నాటి ఉద్యమంలో భాగమైన ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. దేశవ్యాప్త ఖ్యాతి గడించిన వేల్పూర్.. చుట్టుపక్కల మండలాలలకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఇదీ చూడండి: Old Age Pensions: 57 ఏళ్లు నిండిన వారికి గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం