BRS Public Meeting at Bodhan : కాంగ్రెస్ గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి.. రైతులు అరేబియా సముద్రంలోకి వెళ్లడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) హితవు పలికారు. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి.. ప్రజలు గెలిస్తేనే అభివృద్ధి జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. విచక్షణతో ఓటు వేసి సరైన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని.. అభ్యర్థుల గుణగణాలను ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(BRS Public Meeting)లో కేసీఆర్ పాల్గొని.. ప్రసంగించారు.
తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ కృషి చేస్తోందని.. రాష్ట్రానికి ప్రధాన శత్రువు కాంగ్రెస్‌నే అని అన్నారు. 1969లో 400 మంది ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చి చంపిందని ఆవేదన చెందారు. వందల మందిని పొట్టన పెట్టుకుని హస్తం పార్టీ తెలంగాణ ఇచ్చిందని మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో నిజాం సాగర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండగట్టలేదా అంటూ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే నిజాం సాగర్‌కు ఏడాది మొత్తం నిండుగా ఉంచే బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు.
'ప్రజలను పట్టించుకోని ఎమ్మెల్యేలను గెలిపిస్తే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు'
BRS Praja Ashirvada Sabha at Bodhan : 'వ్యవసాయ స్థిరీకరణ జరగాలని బీఆర్ఎస్ శ్రమించింది. వ్యవసాయ స్థిరీకరణ కోసం సాగునీటి పన్ను రద్దు చేశాం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా రైతుబంధు గురించి ఆలోచన చేసిందా? ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు డబ్బులు బ్యాంకు ఖాతాల్లోకి ఎలా వస్తాయి? కాంగ్రెస్‌కు ఓటేస్తే దళారీ రాజ్యం మళ్లీ వస్తుంది. కాంగ్రెస్ గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి.. రైతులు అరేబియా సముద్రంలోకి వెళతారని' సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు.
Telangana Election 2023 : బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ జరగాలని సీఎం కేసీఆర్ సూచించారు. రైతులకు ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ దుబారా అని రేవంత్ రెడ్డి అంటున్నారు.. మరి కాంగ్రెస్ గెలిస్తే రైతులకు 3 గంటల కరెంటుతో సరిపెడతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాంరాం.. దళితుబంధుకు జైభీమ్ అంటారని వ్యంగ్యంగా విమర్శించారు. దుర్మార్గపు కాంగ్రెస్‌ను రైతులు మట్టి కరిపించాలను ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లేనని ఆరోపించారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో సైతం 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు.