Bodhan People request to re open the Sugar Factory: నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని నిజాం షుగర్స్ మూతపడి ఎనిమిదేళ్లు అవుతోంది. దీనిపై ఆధారపడిన కార్మికులు జీవనోపాధి కరవైంది. ఫలితంగా ప్రత్యామ్నాయ మార్గాలపై వెళ్లాల్సి వచ్చింది. అయితే.. ఈ ఫ్యాక్టరీని పునః ప్రారంభించాలనే ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న ఒక లక్ష్యం. కేంద్రం.. ఇథనాల్ ఉత్పత్తికి ప్రోత్సాహం ఇస్తున్న నేపథ్యంలో తిరిగి తెరవాలని కార్మికులు కోరుతున్నారు.
ఈ పరిశ్రమను 1937లో నిజాం చివరి రాజు అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించారు. దీన్ని ప్రారంభించిన సమయంలో ఆసియాలోనే అతి పెద్ద చెక్కర పరిశ్రమ. 15 వేల ఎకరాల్లో నిర్మించిన పరిశ్రమలో ఎంతో మంది కార్మికులకు పనిచేశారు. చాలా కాలం వరకు బాగానే నడిచింది. 2002లో నాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు దీన్ని ప్రైవేటీకరించారు.
అప్పటి నుంచి నష్టాలు రావడం ప్రారంభమయ్యాయి. తర్వాత ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన వైఎస్ రాజశేఖరరెడ్డి.. దీనిపై ఒక కమిటీని నియమించారు. అది ఫ్యాక్టరీని ప్రభుత్వం టేకోవర్ చెయ్యాలని కమిటీ సిఫార్సు చేసింది. తర్వాతి కాలంలో వైఎస్ మరణంతో అది అక్కడే ఆగిపోయింది. కాలక్రమేణా.. 2015లో ఇది మూతపడింది. 2014 ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. దానికి పూర్వ వైభవం తీసుకొస్తానని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రాబోయే 2025 - 2030 వరకు పెట్రోల్‌లో ఇథనాల్ ను 20 శాతం మేర కలపాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రోత్సాహకాలు కూడా ఇస్తోంది. చక్కెర పరిశ్రమలు, ఇతర వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమల్లో ఉత్పత్తి అయ్యే ఇథనాల్‌కు డిమాండ్ ఉంది. మనకు సరిపడా ఇథనాల్ లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
చక్కెర తయారీ ప్రక్రియ నుంచి ఈథైల్ ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. చెరకు రసాన్ని ఫెర్మెంటేషన్ చేయడం ద్వారా బై ప్రొడక్ట్‌గా ఈథైల్ ఆల్కహాల్ వస్తుంది. ఎలాగూ దీనికి బాగా డిమాండ్ ఉన్నందున ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే బదులు... పరిశ్రమను మళ్లీ ప్రారంభించి ఇథనాల్ ఉత్పత్తిని ప్రారంభించాలని కార్మికులు కోరుతున్నారు.
పరిశ్రమలో ఇప్పటికే 30 కెఎల్పీడీ సామర్థ్యం కలిగిన డిస్టిలరీ యూనిట్ ఉందని దాన్ని వినియోగించుకుని ఇథనాల్ ఉత్పత్తి చేపట్టాలని సూచిస్తున్నారు. ఇథనాల్ ఉత్పత్తి ప్రారంభిస్తే అందుకు అనుగుణంగా ఈ ప్రాంతంలో చెరుకు ఉత్పత్తి అధికంగా ఉంటుందని చెబుతున్నారు. తద్వారా ఈ ప్రాంతం మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంటుందని ఆశిస్తున్నారు. అవసరమైతే ఇక్కడి నుంచి ఇథనాల్‌ను దేశ వ్యాప్తంగా సరఫరా చేయొచ్చని సూచిస్తున్నారు. ఒక్కో రైతు దగ్గర నుంచి సేకరించే చెరుకు నుంచి కనీసం 3 వేల లీటర్ల ఇథనాల్ ను ఉత్పత్తి చేయవచ్చని అంటున్నారు.
ఈ నేపథ్యంలో 2014లో ఇచ్చిన హామీని నెరవేర్చి.. బోధన్ షుగర్ పరిశ్రమను తిరిగి తెరిచి ఇథనాల్ ఉత్పత్తి ప్రారంభించి పరిశ్రమకు పూర్వవైభవం తేవాలని.. అంతేకాకుండా, తమను ఆదుకోవాలని ఇక్కడి కార్మికులు, రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: