పౌరహక్కుల నేత, సామాజిక తత్వవేత్త స్వామి అగ్నివేష్ మరణం సమాజానికి తీరని లోటని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఆకుల పాపయ్య పేర్కొన్నారు. న్యూడెమోక్రసీ పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని ఎన్.ఆర్. భవన్లో శనివారం స్వామి అగ్నివేష్ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
స్వామి అగ్నివేష్ చిన్ననాటి నుంచే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని పాపయ్య పేర్కొన్నారు. హర్యానాలో ఎమ్మెల్యేగా గెలిచి.. అనంతరం విద్యాశాఖ మంత్రిగా పని చేశారని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని, సంపూర్ణ మద్యపానం నిషేధించాలని ఉద్యమించారని తెలిపారు.
హర్యానాలోని ఫరీదాబాద్ పారిశ్రామిక వాడలో పోలీసులు 10 మంది కార్మికులను కాల్చి చంపితే.. మంత్రి పదవికి రాజీనామా చేసిన ఘనత ఆయనదని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నగర కార్యదర్శి పరుచూరి శ్రీధర్, సీనియర్ నాయకులు జెల్ల మురళి, భూమన్న, లింగం, రవి, శివ కుమార్, రాజేశ్వర్, నర్సయ్య, సాయిలు, సాయికృష్ణ,ప్రేమ్‌చంద్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. 'ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గంలోనే ఇంత దారుణమా?'