నవంబర్ 26న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (ఆశా)యూనియన్ కమిటీ పిలుపునిచ్చింది. ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా వైద్య శాఖ అధికారికి సమ్మె నోటీసులు అందజేశారు. భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు చేపట్టే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ కోరారు. సీఐటీయూ అనుబంధ సంస్థ తెలంగాణ వాలంటరీ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ సమ్మెలో భాగస్వామి అవుతూ నోటీసు ఇచ్చినట్లు ఆమె తెలిపారు.
పారిశ్రామిక వివాదాల చట్టం 1947 సెక్షన్ 22 సబ్ సెక్షన్ (1)ను అనుసరించి సమ్మెకు నోటీసు ఇచ్చినట్లు వెల్లడించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఆశావర్కర్ల సమస్యలు పరిష్కారం చేయడం లేదని ఆమె ఆరోపించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో రాష్ట్రంలోని ఆశాకార్యకర్తలంతా పాల్గొనాలని ఆమె కోరారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీల నుంచి అందరూ పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సూరి, ఆశా వర్కర్ల నిజామాబాద్ నగర కార్యదర్శి రేణుక, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'మరో 5 రోజులు మాత్రమే ఉంది... బకాయిలు కట్టండి'