నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలో గోదావరిపై నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పూర్తి నష్టపరిహారం అందేలా చూస్తానని పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు రైతులకు హామీ ఇచ్చారు. భాజపా నేతలతో కల్సి సదర్మాట్ బ్యారేజీని సందర్శించారు. అనంతరం రైతుల సమస్యలను తెలుసుకున్నారు. బ్యారేజీ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందజేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా..
ఏళ్లు పూర్తైనా అధికారులు, పాలకులు స్పందించకపోవడం దారుణమని సోయం బాపూరావు అన్నారు. విలువైన భూములు కోల్పోయి.. పరిహారం రాక ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు తెలిపారు. ముఖ్యమంత్రి కార్యదర్శి, స్థానిక మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించి రైతులకు పూర్తి నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ.. రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. జిల్లా కలెక్టర్ వద్ద వివరాలు తీసుకుని రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానన్నారు.
ఇదీ చూడండి: సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు