Monkey Rehabilitation:ఒకప్పుడు అడవులకే పరిమితమైన కోతులు నేడు గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట వానరాలు ఆవాసాల్లోకి ప్రవేశించి ఆహారాన్ని లాక్కోవడం, పంటచేలపై దాడిచేసి ఇబ్బందిపెట్టడం, కరిచిన ఘటనలు పరిపాటిగా మారాయి. ఇలా మానవజాతిని ఇబ్బందులకు గురిచేస్తున్న వానర సంతతిని అరికట్టేందుకు ప్రభుత్వం, అటవీశాఖ ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే గత సంవత్సరం రాష్ట్రంలోనే తొలి పైలట్ ప్రాజెక్ట్‌గా నిర్మల్ శివారులో కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని నెలకొల్పింది. దక్షిణాదిలోనే ఈ తరహా కేంద్రం ఇదే మొదటిది కావడం విశేషం. కానీ దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అలా చేసి ఉండకపోతే..
2007లో హిమాచల్‌ప్రదేశ్‌లో మొదటి సారిగా కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు కోతుల సంఖ్య 3 లక్షలు ఉండేది. శస్త్ర చికిత్సలు చేయడం మొదలెట్టిన 10 నుంచి 15 సంవత్సరాలలో వాటి సంఖ్య 2 లక్షలకు చేరింది. అదే వారు అలా చేసి ఉండకపోతే వానరాల సంఖ్య 6 లక్షలు అయ్యేదని ఓ అంచనా. ఒక కోతి జీవిత కాలం గరిష్టంగా 20 సంవత్సరాలు కాగా ఆడ కోతులు సంవత్సరానికి ఒక పిల్లకు జన్మనిస్తుంది.
అధికారుల అవగాహన లోపం..
గతేడాది డిసెంబర్ 20న నిర్మల్ శివారులోప్రారంభించిన కేంద్రంలో మగ కోతులకి వేసేక్టమి, ఆడ కోతులకి ట్యూబేక్టమీ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఏడాదిగా మొత్తం 700 వానరాలు వచ్చాయి. కోతుల ఆరోగ్య సమస్యలు పరిశీలించి... అర్హత గల వాటిని గుర్తిస్తారు. ఏడాది అవుతున్నా ఇప్పటివరకు కేవలం 389 కోతులకు శస్త్రచికిత్సలు చేశారు. అంటే సగటున రోజుకి ఒకటి నుంచి రెండు మాత్రమే. ఇటీవల నిజామాబాద్ జిల్లాలోని ముప్కల్ గ్రామం నుంచి 5 రోజులలోనే 180 కోతులను పట్టుకొచ్చారు. ఇలా తీసుకొస్తే తక్కువ కాలంలో ఎక్కువ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసే అవకాశాలుంటాయి. సిబ్బంది అందుబాటులో ఉన్నా అధికారుల అవగాహన లోపంతో ఈ కేంద్రం పూర్తి స్థాయిలో సేవలందించలేకపోతోంది. శస్త్రచికిత్స పూర్తైన కోతులను మహబూబ్ ఘాట్ దగ్గర ఉన్న చెకపోస్ట్ నుంచి లోపలికి తీసుకెళ్లి అడవిలో వదిలిపెడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
రానున్న రోజుల్లో కోతులతో..
రాజకీయ నాయకులు, అధికారులు ప్రజల్లో అవగాహన తీసుకొస్తే ఈ కేంద్రంలో సంవత్సరానికి 5 వేల వరకు కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయవచ్చు. లేకపోతే రానున్న రోజుల్లో కోతుల సంఖ్య ప్రతి గ్రామంలో విస్తృతంగా పెరిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీచూడండి: