nirmal wood toys manufacturers: నిర్మల్ జిల్లా పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చేవి కొయ్యబొమ్మలు. పూర్వం నుంచి తాత ముత్తాతలు కొనసాగిస్తూ వస్తున్న ఈ వృత్తినే నమ్ముకుని నకాశి కళాకారులు జీవనం సాగిస్తున్నారు. ఈ కళాకారులు తయారుచేసిన బొమ్మల్లో జీవకళ ఉట్టిపడుతుంది. సుందరీమణులు, వివిధ జంతువులు, పక్షులు, పిచ్చుకలు, నెమళ్లు, పులులు, సింహాలు, జింకలు, నోరూరించే పండ్ల నమూనాలు.. ఇలా ఇంకెన్నో బొమ్మలకు జీవం పోస్తారు. సహజత్వం, సమ్మోహనం నకాశీ కళాకారుల ప్రత్యేకత. చారిత్రక నేపథ్యంలో కోటలు, రాజరిక పోకడలు, శిథిలసౌధాలు.. ఇలాంటివెన్నో దృశ్యాలను సజీవంగా మన ముందు నిలుపుతారు. అంతటి ప్రఖ్యాతి చెందిన కొయ్యబొమ్మల్లో ఉట్టిపడే జీవకళ.. వాటికి చెక్కే నకాశి కళాకారుల జీవితాల్లో తప్పింది.
బతుకు భారంగా మారుతోంది..
నకాశి కళాకారాలు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బొమ్మల ఆకృతులను బట్టే వాళ్లకు డబ్బులు వస్తాయి. ఒక్కో రూపానికి ఒక్కో ధరను నిర్మల్ పారిశ్రామిక సహకార సంఘం నిర్ణయిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బొమ్మల ధర అలాగే ఉన్నా.. మార్కెట్లో మాత్రం ముడిసరుకుల రేట్లు విపరీతంగా పెరిగాయి. పని చేసినంతసేపే కళాకారులకు భత్యం లభిస్తుంది. ఈ వృత్తిలో ఉన్నవాళ్లకు రోజుకి 300 నుంచి 400 రూపాయల వరకు మాత్రమే గిట్టుబాటు అవుతోంది. ధరలు గిట్టుబాటు కాకపోవటం వల్ల పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదు. కళకు కూడా సరైన గుర్తింపు లభించకపోవటం వాళ్లను తీవ్రంగా కలచివేస్తోంది. వచ్చేదాంతో పూట గడవటం కూడా భారంగా మారిందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉండటానికి ఇల్లు కూడా లేని వాళ్లు ఉన్నారని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆపదలో ఉన్న కళాకారులకు ఆర్థికంగా సహకారం అందించాలని వేడుకుంటున్నారు.
ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి..
"నేను ఇక్కడ గత 35 ఏళ్లుగా పని చేస్తున్నా. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. మా తర్వాతి తరం ఈ పనిపై ఆసక్తి చూపడం లేదు. నేలపై కూర్చొని ఓపికతో చేసే పని. ఈ వృత్తిలో రోజుకి రూ.300 నుంచి 400 మాత్రమే గిట్టుబాటవుతోంది. వచ్చేదాంతో జీవనం చాలా ఇబ్బందిగా మారింది. ఇక్కడ వర్కర్లకి ఏమైనా ఎవరూ పట్టించుకునేవారు లేరు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా సహకారం అందించి మమ్మల్ని ఆదుకుంటే బాగుంటుంది. ఇతర వృత్తుల వారికి అందిస్తున్న విధంగా మాకు సభుత్వ సంక్షేమ పథకాలు కల్పించాలి. వృద్ధులు, వికలాంగులతో పాటు వృత్తి విరమణ పింఛన్లు ఇవ్వాలి." - కిషన్, నకాశి కళాకారుడు
కొయ్యబొమ్మల గురించి పుస్తకాల్లోనే..
మార్కెట్లో రోజురోజుకి ఆధునిక సాంకేతికతతో తయారవుతున్న బొమ్మలు అందుబాటులోకి వస్తుండటం వల్ల.. ఇప్పటికే చాలా వరకు చేతివృత్తుల పరిశ్రమలు కనుమరుగైపోయాయి. ఈ వృత్తిలో తగిన ప్రోత్సాహం లభించక యువత చాలావరకు ఇప్పటికే ప్రైవేట్ ఉద్యోగాలలో చేరుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో ఈ కళ అంతరించిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. నిర్మల్ కొయ్యబొమ్మల గురించి పుస్తకాల్లో మాత్రమే చదువుకోవాల్సిన రోజులు వస్తాయేమోనని ఆ కళాకారులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఇదీ చూడండి: