రాష్ట్రపతి చేతులమీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్న గుస్సాడీ కళాకారుడు కనకరాజు(padma shri for gussadi kanakaraju)కు స్వస్థలం నిర్మల్‌లో ఘనస్వాగతం లభించింది. ఆదివాసీల సంప్రదాయ నృత్యాలు, బాజాభజంత్రీలతో కనకరాజ్‌ను సాదరంగా ఆహ్వానించారు. దారి పొడవునా.. స్థానికులు నీరాజనాలు పలికాలు. ప్రజలు, విద్యార్థులు కనకరాజుతో కలిసి ఫొటోలు తీసుకున్నారు.
పట్టణంలోని రాంజీగొండు, కుమురం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి కనకరాజు నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కనకరాజును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, వైస్ ఛైర్మన్ షేక్ సాజీద్, కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
తెలంగాణ మొత్తానికి..
"గుస్సాడీ నృత్యాన్ని కేంద్రం గుర్తించి పద్మశ్రీ పురస్కారం అందించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నాకు వచ్చిన ఈ పురస్కారం నాకూ, నా కళకు, నా ప్రాంతానికి మాత్రమే కాకుండా.. తెలంగాణ మొత్తానికి గౌరవప్రదంగా భావిస్తున్నా. నాకు భారత ప్రభుత్వం ఇంత గొప్ప పురస్కారం ఇస్తుందని కలలో కూడా ఊహించలేదు. పద్మశ్రీ అవార్డు ఒకటుందని నాకు ఇచ్చేవరకు కూడా తెలియదు." - కనకరాజు, గుస్సాడీ కళాకారుడు
![nirmal-people-welcome-gussadi-kanakaraju-in-a-grand-way](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13607951_pppddddv.jpg)
గుస్సాడీ నృత్యమే ఆలంబనగా..
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో గుట్టపై ఉన్న గిరి పల్లె మార్లవాయి కనకరాజు జన్మస్థలం. పేద రైతు దంపతుల రాము, రాజుభాయిల ఏకైక కుమారుడు ఆయన. 80 ఏళ్ల వయసున్న రాజుకు ఆ రోజుల్లో విద్యావకాశాలు లేవు. ఓ మాస్టారు దగ్గర మరాఠీ అక్షరాలు మాత్రమే నేర్చుకున్నారు. తండ్రితో వ్యవసాయ పనులకు వెళ్లేవారు. రాజుకు ఇద్దరు భార్యలు.. పెద్ద భార్య పార్వతీబాయి ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు... చిన్న భార్య భీమ్ భాయికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. అందరికీ వివాహాలు అయ్యాయి. కుమారులంతా వ్యవసాయం చేస్తున్నారు. గుస్సాడీ నృత్యమే ఆలంబనగా కనకరాజు పెరిగారు.
'గుస్సాడీ'లో యువతకు శిక్షణ
పూర్వీకులు అందించిన సాంప్రదాయ నృత్యాన్ని ఆదివాసీలు భగవత్(పెర్సపెన్) స్వరూపంగా తలుస్తారు. దీనికి చేచోయ్ నృత్యం అని కూడా పేరు. ఓ గ్రామం నుంచి మరో గ్రామానికి దీపావళి దండోరా సమయంలో వెళ్లి నృత్యం చేయడం ఆదివాసీల ఆనవాయితీ. అతి పవిత్రంగా భావించే ఈ నృత్యాన్ని కనకరాజు తన తండ్రి రాము, గ్రామ పెద్ద కనకా సీతారాం ఆధ్వర్యంలో ఆదివాసీ గూడేల్లో ప్రదర్శించే సమయంలో ప్రేరణకు గురై వారితో కాలు కదిపారు. కొద్ది రోజుల్లోనే రాజు తన బృందం వారికి శిక్షకుడిగా మారారు. ఆసక్తి ఉన్న యువకులకు ఇప్పటికి శిక్షణ ఇస్తున్నారు.
- గుస్సాడీ కళా'పద్మం' కనకరాజు ఆసక్తికర ప్రయాణం తెసుకునేందుకు... నెమలి పింఛం ఆడేన్.. పద్మశ్రీ వరించేన్... క్లిక్ చేయండి