నిర్మల్ జిల్లాలో రూర్బన్ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. రూర్బన్ పథకం అమలుపై సమావేశం నిర్వహించారు. పట్టణాలకు ధీటుగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం రూర్బన్ పథకం ప్రవేశపెట్టిందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఈ పథకం అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టి... గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలతో పాటు రూపురేఖలు మార్చే దిశగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు.
త్వరలోనే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. క్షేత్ర స్థాయిలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనుల పురోగతిని పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఆర్డీఓ వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ ఎస్ఈ జైవంత్ చౌహన్, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.