రైతువేదికల నిర్మాణం, రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి... నిర్మల్ జిల్లా చిట్యాలలో రైతవేదికను ప్రారంభించారు. తెలంగాణలో రైతులను సంఘటితం చేసేందుకే రైతువేదికలు నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. అన్నదాతలంతా ఒకచోట చేరి తమ సాదకబాధకాలను చర్చించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. జిల్లాలో చేపట్టిన 79 రైతువేదికలు దాదాపుగా పూర్తి కావచ్చాయని తెలిపారు. స్వర్ణవాగుపై 11 చెక్‌డ్యాంలు, చిట్యాలవాగుపై రూ.3 కోట్లతో చెక్‌డ్యాం నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత అన్ని రంగాల్లో ముందుకుపోతున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో జీవవైవిధ్యం... పునరుజ్జీవం పోసుకుందని... అచరించిపోతున్న అనేక జీవాలు మళ్లీ కనబడుతున్నాయని పేర్కొన్నారు. అరవై ఏళ్ల కష్టాల నుంచి ఆరేళ్ల కాలంలో బయటపడగలిగామని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు పూర్తి కావడం వల్ల కోటి ఎకరాలకుపైగా సాగునీరు అందిస్తున్నట్టు తెలిపారు. రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగైందన్నారు.
కేంద్రం తీసుకొని నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. భాజపా నాయకులకు కేసీఆర్‌ను విమర్శించే అర్హత లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాలను బెదిరిస్తూ రాజకీయ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాల నుంచి పన్నులు వసూలు చేసి... అవే నిధులు ఇస్తున్నారు తప్ప వాళ్ల జేబుల నుంచి ఇస్తున్నారా? అని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జడ్పీ ఛైర్పర్సన్ విజయలక్ష్మి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రాం రెడ్డి, సర్పంచ్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'జనవరి తొలివారం నుంచి ఉచిత తాగునీటి సరఫరా'