ఓ యువకుడి ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్ భూసమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం హంగీర్గ గ్రామానికి చెందిన సూర్యవంశీ సురేశ్ అనే యువకుడు ధరణిలో తన రెండెకరాల భూమి రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్నట్లు చూపిస్తోందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన భూమి ప్రభుత్వ భూమిగా చూపిస్తోందని వివరించారు. దీనిపై కలెక్టరేట్‌కు రెండు సార్లు వెళ్లినా.. ధరణిలో దరఖాస్తు చేసినా స్పందన రాకపోవడంతో నిన్న కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.
మంత్రి ఆదేశాలతో సమస్యను తెలుసుకొని రికార్డులను పరిశీలించి తగిన న్యాయం చేస్తామని తానూర్ తహసీల్దార్ తెలిపారు. సురేష్ పెద్దనాన్నకు సంబంధించిన భూమి ఓ కంపెనీకి అమ్మడంతో దానిపై కోర్టులో కేసు ఉండడంతోనే తిరస్కరించడం జరిగిందని ఎమ్మార్వో తెలిపారు. ఆ భూమిని సర్వే నంబరు నుంచి వేరు చేసి సురేశ్‌కు పట్టా అయ్యేలా చూస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.