ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి త్వరతగతిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 2016 సంవత్సరం నుంచి ఇప్పటివరకు నమోదైన అట్రాసిటీ కేసులపై సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరతగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయంతో పాటు రిలీఫ్ ఫండ్ అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు.
పౌర హక్కుల దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రతి పంచాయతీ దగ్గర లేదా రచ్చబండ దగ్గర చట్టంపై గ్రామ ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. బోగస్ కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మారక ద్రవ్యాల నిషేదిత చట్టం దర్యాప్తులో మెళుకువలకు సంబంధించిన బుక్లెట్ను మంత్రి అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఏఎస్పీ రాంరెడ్డి, డీఎస్పీ ఉపేంద్ర రెడ్డి, డీఆర్వో సోమేశ్వర్, డీఆర్డీవో వేంకటేశ్వర్లు, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'ఇంటి వద్ద చదువులు కొనసాగించాలి.. అందుకే ఈ పుస్తకాలు'