నిర్మల్ పట్టణం అన్నీ రంగాల్లో ముందుండేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిర్మల్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దేలా అన్నీ చర్యలు తీసుకుంటానని, పట్టణంలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించి.. పట్టణంలోని 42వార్డులను సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇప్పటికే జౌళీ నాలా పూడికతీత పనులు, స్ట్రిప్ లైటింగ్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. చెత్త సేకరణ ఆటోలకి జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేయించి ప్రతిరోజు కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేస్తున్నామని అన్నారు. చైన్ గేట్ నుండి బంగల్ పేట్ వరకు రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించామన్నారు.
పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హరిత హారంలో మున్సిపల్ బడ్జెట్ నుండి 10 శాతం నిధులను కేటాయించి ట్రీగార్డులను ఏర్పాటు చేసి.. మొక్కలను రక్షిస్తామన్నారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఇంటిలో, ప్రతి వీధిలో మొక్కలు నాటి రక్షించాలని సూచించారు. మంచిర్యాల చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రహదారి అభివృద్ధి పనులు, ధర్మసాగర్ చెరువు, బత్తిస్ ఘడ్, శ్యామ్ఘడ్ కోట సుందరీకరణ పనులు, మోడల్ మార్కెట్ నిర్మాణం, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం, ఖిలాగుట్టపై జాతీయ పతాకం ఏర్పాటు వంటి మేజర్ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి.. సకాలంలో పూర్తి చేసి పట్టణ రూపురేఖలు మార్చేస్తామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, డీఈ సంతోష్ కుమార్, కౌన్సిలర్లు, మున్సిపల్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా