కరోనా వ్యాప్తితో పాఠశాలలు తెరవడం కష్టంగా ఉందని...విద్యార్థులు ఇంటి వద్ద చదువుకోవడానికి ప్రభుత్వం పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టిందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కడ్తాల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పంపిణీ చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కరోనా దృష్ట్యా పాఠశాలల ప్రారంభం ఆలస్యం అయినందున పుస్తకాలు ముందు అందిస్తే విద్యార్థులు ఇళ్లలో చదువుకోవడానికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిణీకి ఆదేశాలు ఇచ్చారన్నారు. విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మంత్రి వివరించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. గత సంవత్సరం నాటిన మొక్కలను సంరక్షించినందుకు గాను పాఠశాల సిబ్బందిని విద్యార్థులను శాలువాతో మంత్రి సన్మానించారు.
ఇదీ చూడండి:- 'భారత్-చైనా మధ్య మరొకరి జోక్యం అవసరం లేదు'