నిర్మల్ జిల్లా కేంద్రంలోని పుర ఎన్నికల ఓటరు ముసాయిదా జాబితా తప్పుల తడకలుగా మారింది. ఇప్పటికే జాబితా వివరాలను అధికారులు ప్రకటించడం వల్ల జాబితా చూసిన ఆశావహులు నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు. ఊహించిన దానికి భిన్నంగా జాబితా ఉండటం, వివరాల నమోదు పొరపాటు కారణంగా రిజర్వేషన్లు తారుమారయ్యే అవకాశం ఉందని విస్తుపోతున్నారు.
ఓటు వెతుక్కోవాల్సిన పరిస్థితి..
తక్కువ సమయం ఉండటం వల్ల జాబితాను సరిచేస్తారో లేదోనన్న సందిగ్ధం ఏర్పడింది. తమ వార్డుల్లో వచ్చిన ఓటర్ల వివరాలు తెలియక ఓటరు జాబితాతో వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఓటరు ఉండేది ఒక వార్డులో అయితే పేరు నమోదు మరో వార్డులో ఉంటోంది. వారిని ఓటు అడిగేది ఎట్లా అని పోటీ చేసే అభ్యర్థులు సతమతమవుతున్నారు.
కార్యాలయం చుట్టూ..
ఇటు ఓటర్లు సైతం తమ ఓట్లు ఏ వార్డులో చేర్చారో తెలియక వార్డులో పోటీ చేసే అభ్యర్థుల చుట్టూ, పురపాలక కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. సమయం సరిపోలేదని ఇదే తరహాలో జాబితా పెడితే ఇటూ ఓటర్లు, అటూ పోటీచేయాలనుకునే ఆశావాహులు నష్టపోక తప్పదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓటర్ ముసాయిదా జాబితాను సరైన రీతిలో సవరించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి : వనదేవతలను దర్శించుకున్న మంత్రులు