ఎస్సారెస్పీ పునరావాస గ్రామాల్లోని మిగులు భూములు కొందరి పాలిట వరంగా మారాయి. రాజకీయ నేతల అండదండలు, అధికారుల సహకారంతో బాధితులకు తెలియకుండా కొందరు అడ్డదారిలో పట్టాలు పొందుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సాంగ్వి గ్రామస్థులు తమ నివాస, సాగు భూములను కోల్పోయారు. ఐదు దశాబ్దాల క్రితం ప్రతి కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఐదెకరాల సాగు భూమిని నిర్మల్ జిల్లా మామడ మండలంలో కేటాయించారు. ఇందుకోసం అవసరమైన డీ1 పట్టాలను వారికి ప్రభుత్వం జారీ చేసింది.
సుమారు 200 ఎకరాలు..
ఈ ప్రాంతంలో బాధితులు అప్పట్లోనే ఇళ్లు నిర్మించుకోవటంతో... కొత్తగా మళ్లీ సాంగ్వి గ్రామం ఏర్పడింది. నాటి నుంచి వారంతా భూములను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదే సమయంలో పశువులకు మేత, వంటచెరుకు పెంపకం, చెరువు, ఆలయం నిర్మాణం, ఇతర అవసరాల కోసం దాదాపు 200 ఎకరాల స్థలాన్ని సర్కార్ అందుబాటులో ఉంచింది.
వాటిపై కన్నేసిన అక్రమార్కులు..
ఈ మిగులు భూములపై కన్నేసిన పలురువు అక్రమార్కులు... అధికారుల సహకారంతో పట్టాలు సంపాదించారు. భవిష్యత్తు అవసరాల కోసం వదిలిన ఈ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. దీనిపై గ్రామస్థులకు అనుమానం వచ్చి... రికార్డులు తిరగేయగా దాదాపు 150 ఎకరాల స్థలాన్ని ఇతర ప్రాంతాలకు చెందిన వారికి పట్టాచేసినట్లు బయటపడింది. తమ గ్రామానికి చెందిన స్థలాన్ని ఇతరులకు ఎలా పట్టా చేసిచ్చారోనని గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయంపై ఇప్పటికే అధికారులను కలిసి విన్నవించినా ఎవరూ స్పందించలేదని వాపోతున్నారు. భూముల్లోకి వచ్చిన వారిని ప్రశ్నిస్తే.. బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు.
వారిపై చర్యలు తీసుకోవాలి..
గ్రామస్థులకు కనీస సమాచారం లేకుండా అక్రమంగా పట్టాలు జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సాంగ్వి గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే అనర్హులను గుర్తించి... వారికి జారీచేసిన పట్టాలను రద్దు చేసి... తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: మాపై దాడులను అరికట్టండి.. ఈటలతో వైద్యులు