తనకు దొరికిన పది గ్రాముల బంగారాన్ని తిరిగి బాధితుడికే ఇచ్చేసి నిజాయితీ నిరూపించుకున్నారు నిర్మల్ జిల్లాలో ఓ గ్రామ కార్యదర్శి. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పాకపట్ల గ్రామానికి చెందిన గడ్డం గంగారెడ్డి అనే రైతు తన మనవరాలి శుభకార్యం కోసం నిర్మల్లో పది గ్రాముల బంగారం కొనుగోలు చేసి ఇంటికి వచ్చాడు. ఇతర పనుల్లో మునిగిపోయి.. బంగారం బయట పెట్టి మరిచిపోయాడు. గంగారెడ్డి తండ్రి ముత్తన్న బంగారం పెట్టిన కవర్ చూసి.. ఏదో చెత్త కవర్ అని బయట పారేశాడు.
ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన గ్రామ కార్యదర్శి సంధ్యారాణి విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నారు. రోడ్డుపై కనిపించిన కవర్ చూసి.. తెరిచి చూడగా.. అందులో రెండు బంగారు ఉంగరాలు కనిపించాయి. వెంటనే ఆ బంగారాన్ని గ్రామ వీఆర్ఏకి అప్పజెప్పారు. బంగారం పోగొట్టుకున్న వారు ఎవరైనా ఉంటే గ్రామ పంచాయతీ కార్యాలయానికి రావాలని గురువారం రాత్రి మైక్ ద్వారా గ్రామంలో చాటింపు వేయించారు. ఆ బంగారం గంగారెడ్డికి చెందినదని. మవనరాలి శుభకార్యానికి తెచ్చినదని తెలిసింది. అందరి సమక్షంలో శుక్రవారం పంచాయితీ కార్యాలయంలో ఆ బంగారాన్ని అప్పజెప్పారు. తనకు దొరికిన బంగారాన్ని తిరిగి వారికే అప్పజెప్పిన గ్రామ కార్యదర్శి సంధ్యారాణిని గ్రామస్తులు అభినందించారు.