నిర్మల్ జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షం కారణంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం అంతా తడిసి ముద్దయింది. కొన్నిచోట్ల వరద నీటిలో కొట్టుకుపోయింది. నెలన్నరగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంటోందని... అధికారుల నిర్లక్ష్యం వల్లనే తడిసిపోయాయని రైతులు ఆరోపించారు.
అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి మొలకలొస్తున్నాయని ఆవేదన చెందారు. కొనుగోలు కేంద్రాల్లోనే రోజుల తరబడి ఉండటం వల్ల వేరే వ్యవసాయ పనులు చేసుకోలేక పోతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసినా... గోదాముల్లోకి తరలించేందుకు లారీలు లేవని కేంద్రాల్లోనే ఉంచుతూ... వర్షార్పణం చేస్తున్నారని మండిపడుతున్నారు. ధాన్యం తరలించేందుకు బస్తాకు 20 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారని, రైతుల సమస్యలు పరిష్కరించేవారే కరువయ్యారని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.