నిర్మల్ జిల్లాలో అల్లం రైతులు దుంపకుళ్లు తెగులుతో ఇబ్బందులు పడుతున్నారు. వెంకట్రెడ్డి అనే రైతు రూ.8 లక్షలు పెట్టుబడి పెట్టి.. 6ఎకరాలలో అల్లం పంట వేశారు. మొలక వచ్చినప్పటి నుంచి వారానికోసారి మందు పిచికారీ చేస్తున్నా.. గత వారం నుంచి తెగులు తగిలిత పంట ఎండిపోతున్నదని, అధికారులు తగు సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు.
అల్లం పంట వేసినప్పటి నుంచి కూలి పనిచేస్తూ.. సమయానికి మందులు వేస్తూ.. మొక్క ఎండిపోకుండా నీళ్లు వేస్తున్నామని అయినా.. మొక్క తవ్వి చూస్తే.. పురుగు తింటున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముధోల్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా 8 ఎకరాలలో అల్లం సాగును చేపట్టామని రైతులు తెలిపారు. సంవత్సరానికి 700 నుంచి 1000 మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయని, అల్లం సాగు చేయాలంటే ఎర్రనేలలు, చౌడు నేలలు అనుకూలంగా ఉంటాయని ఉద్యానవన అధికారి హర్ష తెలిపారు. అల్లం పంటను మే నెల రెండవ వారం నుంచి నెల చివరి వరకు నాటుకోవచ్చని ఎకరాకు 6నుంచి 8క్వింటాళ్ల విత్తనం అవసరం పడుతుందని.. విత్తే ముందు విత్తన శుద్ధి చేసి వేయాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచించారు.
అల్లం పంటకు సోకే దుంపకుళ్ళు తెగులు, ఆకుమాడు తెగులు, ఆకుమచ్చ తెగులు ప్రధానంగా సోకే.. తెగుళ్లని.. దుంపకుళ్లు తెగులు పంటను తీవ్రంగా దెబ్బ తీస్తున్నదని.. కార్బోపెరిన్, గుళికలు ఎకరాకు 10కిలోల చొప్పున ఇసుకలో కలిపి చల్లితే.. పంట బాగా ఎదుగుతుందని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణం తేమగా ఉండి అధిక వర్షపాతం నమోదైతే ఈ దుంపకుళ్ళు వ్యాపిస్తుంది. దీని నివారణకు మ్యాంకోజబ్ ద్రావణం లీటర్ నీటికి 2 గ్రాములు, రినోఫెల్ ఎంజెడ్ లీటర్ నీటికి 2గ్రాములు, ఫెరాక్సి క్లోరైడ్ లీటరు నీటికి 3 గ్రాములు కలిపి వ్యాధి సోకిన మొక్క తడిసేలా పిచికారీ చేస్తే తెగులునివారించవచ్చు అని ఉద్యానవన అధికారి తెలిపారు.
ఇదీ చూడండి: లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్ సహా ఇద్దరు మృతి