చామన్ పెళ్లి గ్రామంలోని శ్రీనివాస్ రెడ్డి అనే రైతు 3 ఏకరాల్లో సన్నరకం వారి సాగుచేశాడు. పొట్టదశకు చేరాక పంటకు దోమ సోకింది. నిస్సహాయక స్థితిలో పంటకు నిప్పుపెట్టాడు. పంట పూర్తిగా తెగులుపడి తీవ్రనష్టం వాటిల్లిందని వాపోయాడు. ఎండిన పంటను కోయించాలంటే కూలీ డబ్బులు భారమనే.. నిప్పంటించినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం అధికారులతో సర్వే చేయించి పరిహారం అందించాలని కోరుతున్నాడు.
సీఎం సూచనతోనే..
గ్రామంలో సుమారు 250 ఎకరాల వరకు సన్నరకం వరి సాగుచేసిన రైతు పరిస్థితి ఇలానే ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యమంత్రి సూచనతోనే సన్నరకం సాగుచేశామని పలువురు రైతులు తెలిపారు. దోమకాటు వల్ల ఎకరాకు రూ. 30 వేలు నష్టపోవాల్సి వచ్చిందంటూ వాపోయారు.
పంటలు కోత దశకు వస్తున్నా.. ఇప్పటి వరకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయలేదని వాపోయారు. తెగుళ్లతో నష్టపోయిన తమకు ప్రభుత్వం వెంటనే స్పందించి పరిహారం పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: 'పూట గడవని పరిస్థితిలో ఉన్నాం... రుణాన్ని చెల్లించలేం'