నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్‌జీయూకేటీ)లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రవేశాలకు ఈసారి విద్యార్థుల వయసే కీలకం కానుంది. పదో తరగతి విద్యార్థులకు అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇస్తున్నందున.. రాష్ట్రవ్యాప్తంగా 10 జీపీఏ దక్కించుకోనున్న వారి సంఖ్య భారీగా పెరగనుంది. రాష్ట్రంలో వారి సంఖ్య లక్ష వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నా.. కనీసం 50 వేలకు మాత్రం తగ్గదని చెబుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ఉన్నత పాఠశాలలో ఈసారి 16 మంది విద్యార్థులకు 10 జీపీఏ దక్కనుంది. ఇలాంటివి వందలాది పాఠశాలలు ఉన్నాయి. విశ్వవిద్యాలయంలో 1500 సీట్లు ఉండగా.. 10 జీపీఏతో పోటీపడే వారు వేల సంఖ్యలో ఉండనున్నారు. ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించాలన్న ఆలోచన ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా నిర్వహణ ఇబ్బంది కావొచ్చని భావిస్తున్నారు. విశ్వవిద్యాలయం ప్రవేశాల కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో త్వరలో ప్రవేశాల విధానంపై తుది నిర్ణయం తీసుకోనుంది.
పుట్టిన తేదీ పరిగణనలోకి..
పదో తరగతిలో గ్రేడ్ సమానమైతే అప్పుడు ఇద్దరిలో పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకుంటారు. ఎవరి వయసు ఎక్కువగా ఉంటే వారికి సీటిస్తారు. వయసు సమానంగా ఉంటే.. పది హాల్ టికెట్ సంఖ్య నుంచి ప్రత్యేక ఫార్ములా ద్వారా ర్యాండమ్ సంఖ్య తీసుకొని ప్రవేశం కల్పిస్తారు.
ఒకవేళ 10.20 గ్రేడ్ దక్కిన వారి మధ్య టై అయితే (ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి 0.40 స్కోరు కలిపి పరిగణనలోకి) అప్పుడు పదో తరగతిలో గణితంలో గ్రేడ్‌ను పరిశీలిస్తారు. తర్వాత సైన్స్, ఆంగ్లం, సాంఘిక శాస్త్రం, తెలుగు, పుట్టిన తేదీ, తక్కువ ర్యాండమ్ సంఖ్యను చూసి ప్రవేశం కల్పిస్తారు.