ఎండలు మండే వేళ వేడి నుంచి ఉపశమనాన్ని పొందేందుకు ఎర్రటి పుచ్చకాయలు ఎంతగానో ఉపయోగపడతాయి. పోషకాలు పుష్కలంగా ఉండే పుచ్చ... వేసవి సమయంలో శరీరానికి శక్తిని అందిస్తుంది. వేసవిలో మంచి డిమాండ్ ఉన్న పుచ్చ పంటను సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు నేటితరం యువరైతులు.
నారాయణ పేట జిల్లా నర్వ మండలం పాతర్చెడ్కు చెందిన యువ రైతు ఆవుల సురేశ్ తనకున్న ఆరు ఎకరాల పొలంలో పుచ్చ పంట పండిస్తున్నాడు. అందరిలా మూస ధోరణులను పాటించకుండా ఆధునిక సాగు విధానాలను అందిపుచ్చుకున్నాడు. నేరుగా నేల మీద పంట సాగు చేయకుండా ఎత్తైన బెడ్‌లను నిర్మించి డ్రిప్, మల్చింగ్ పద్ధతిని అనుసరించాడు.
మొక్కకు మొక్కకు మధ్య ఒకటిన్నర అడుగుల దూరంలో జిగ్‌జాగ్ పద్ధతిని పాటించి ఎకరాకు 4500 మొక్కలు నాటుకున్నాడు. మేలైన యాజమాన్య పద్ధతుల ద్వారా ఒక్కొక్క కాయ సైజు 5 నుంచి 8 కిలోలపైనే కాస్తోంది. ఎకరాకు 25 నుంచి 30 టన్నుల వరకు దిగుబడిని పొందుతున్నట్లు యువరైతు సురేష్ చెబుతున్నాడు.
ఒక ఎకరానికి 60 నుంచి 80 వేల వరకు పెట్టుబడి అవుతోందంటున్నాడు సురేశ్. ప్రస్తుతం కిలోకు 8 నుంచి ఎనిమిదిన్నర రూపాయల ధర ఉందంటున్నాడు. 70 రోజుల్లోనే పంట చేతికి రావడం... ఒక్కొక్క కాయ సైజు 5 నుంచి ఎనిమిది కిలోల పైనే ఉండటంతో వ్యాపారులు తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నాడు.
మూస పద్ధతిని పక్కన పెట్టి ఆధునిక విధానాలను అందిపుచ్చుకుని లాభాలను ఆర్జిస్తున్నాడు ఈ యువరైతు. తోటి రైతుల కష్టాల సాగుకు స్వస్తి పలికి... లాభాలు అందించే పంటలు పండించాలని సూచిస్తున్నాడు సురేశ్.