mana uru_mana badi scheme: మన ఊరు- మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు కొత్త కళను సంతరించుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టి నిధులు కేటాయించడంతో చాలా చోట్ల వాటి రూపు రేఖలు మారుతున్నాయి. ఆకర్షణీయ రంగులతో.. సరి కొత్త హంగులతో, మౌలిక వసతుల కల్పనతో సర్కారు బడులు కార్పొరేట్ పాఠశాలలను తలపిస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో 12 రకాల మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు తొలి విడత పనులకు 2022 మార్చి 9న ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి జిల్లాలో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు.
నారాయణపేట జిల్లాలో మొదటి విడతలో 174 పాఠశాలలను ఎంపిక చేశారు. ఫిబ్రవరి 1న 2 పాఠశాలలను ప్రారంభించారు. జిల్లాలో 85 పాఠశాలలు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి. మార్చి 31 వరకు 31 పాఠశాలల్లో పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మే 31 వరకు 56 పాఠశాలలో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రానున్నారు. మొదటి విడతలో జిల్లాలో 174 పాఠశాలలను ఎంపిక చేయగా ఇందులో 30 పాఠశాలలకు 30 లక్షలకు పైగా నిధులు కేటాయించడంతో టెండర్లు పిలిచారు. 20 పాఠశాలలకు టెండర్లు పూర్తి చేసుకుని పనులు కొనసాగుతున్నాయి. మిగతా 10 పాఠశాలలు టెండర్లు, అగ్రిమెంట్ దశలో ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో పనులు నత్తడకన కొనసాగుతున్నాయి.
పాఠశాలల్లో కల్పించే 12 రకాల వసతులు ఇవే:
1. నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్లు
2. విద్యుదీకరణ
3. తాగునీరు
4. ఫర్నిచర్, పిల్లలకు డ్యూయల్ డెస్కులు. ఉపాధ్యాయులకు బెంచీలు, కుర్చీలు, బీరువాలు
5. బడి అంతటా రంగులు
6. పెద్ద, చిన్నతరహా మరమ్మతులు
7. గ్రీన్ బోర్డులు
8. ప్రహరీ
9. వంటగది
10. నూతన గదులు
11. భోజనశాల (ఉన్నత పాఠశాలల్లో మాత్రమే)
12. డిజిటల్ తరగతి గదులు..
ఈ వసతులన్నీ అందుబాటులోకి రావటంతో సర్కారు బడులు కొత్త కళను సంతరించుకున్నాయి. విద్యార్ధులు, ఉపాద్యాయులు దీనిపట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మారుతున్న మౌళిక వసతులు: రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు_ మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు మౌళిక వసతులను కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే కొన్ని పాఠశాలల రూపురేఖలు మారిపోగా మరికొన్ని పాఠశాలలలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోకుండా వాటికి ధీటుగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నారు. దీని వల్ల విద్యార్థులకు ఇక్కట్లు తప్పుతున్నాయి. మంచి వసతులతో కూడిన పాఠశాలలు ఉంటే విద్యార్థులు కూడా చదువుకోవడానికి ఆసక్తిని చూపుతారు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.
ఇవీ చదవండి: