silver coins found: నారాయణపేట జిల్లా ఊట్కూరు మెయిన్ బజార్‌లో 1835లో నిర్మించిన ఇంటిని యజమానులు గాళ్ల ఉమేష్, గాళ్ల కిరణ్ కొన్ని రోజుల కిందట కూల్చి వేశారు. ఆ శిథిలాలను సర్పంచ్ సి.సూర్యప్రకాశ్‌రెడ్డి సూచన మేరకు మంగళవారం ట్రాక్టర్లలో వైకుంఠ థామంలో గుంతలకు తరలించారు. అటువైపు వెళ్లిన వారికి ఆ శిథిలాల్లో కొన్ని వెండి నాణేలు దొరకటంతో విషయం తెలిసి గ్రామస్థులు పలువురు వెళ్లి వెతికారు.
సుమారు 35 నుంచి 40 నాణేల వరకు లభించినట్లు ప్రచారం. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సాయంత్రం ఏఎస్‌ఐ సురేందర్, ఆర్‌ఐ మల్లేష్ అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. పాత ఇంటి దగ్గర కూడా యజమానికి అయిదు నాణేలు లభించడంతో వాటిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిపై చార్మినార్ బొమ్మ, ఉర్దూ భాషలో ముద్రించి ఉండటంతో నిజాం నవాబుల కాలం నాటివిగా భావిస్తున్నారు. వాటిని పురావస్తు శాఖ అధికారులకు అప్పగించినట్లు తహసీల్దారు తిరుపతయ్య తెలిపారు.
ఇదీ చూడండి: అంకురం నుంచి ప్రపంచ సంస్థగా... భారత్‌బయోటెక్ విజయంలో సుచిత్ర ఎల్ల పాత్ర