విద్యార్థులందరూ ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాలు వినేలా కేబుల్ ఆపరేటర్లు దూరదర్శన్, టీ-శాట్ ఛానళ్లను తప్పకుండా ప్రసారం చేయాలని నారాయణపేట కలెక్టర్ హరిచందన ఆదేశించారు. ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో విద్య, వైద్యశాఖ, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పుర కమిషనర్లు, ప్రధానోపాధ్యాయులతో టెలీ కాన్ఫరెన్స్ నిర‌్వహించారు. జిల్లాలోని విద్యార్థులందరికీ వందశాతం డిజిటల్ విద్య అందించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
గ్రామాల్లో డిజిటల్ సాధనాలు లేని విద్యార్థులను వారి స్నేహితుల ఇళ్లలో చూసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పంచాయతీ కార్యాలయంలోని టీవీని వినియోగించుకోవాలని సూచించారు. డిజిటల్ తరగతులను వీక్షించిన విద్యార్థుల వివరాలు అందించాలని తెలిపారు.
తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పుర కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు పర్యటించి పర్యవేక్షించాలన్నారు. పంచాయతీ కార్యాలయాన్ని రోజూ శుభ్రం చేయాలని పేర్కొన్నారు. తరగతులు కొనసాగే సమయంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.