నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ శివారులోని 947 సర్వే నంబరులో మూడెకరాల పది గుంటల శిఖం భూమితో ఉన్న నిజాం కాలం నాటి కుమ్మరి కుంటలోని ఎకరన్నర స్థలం కబ్జాకు గురైంది. ఈ ప్రభుత్వ స్థలంలో ఇళ్లు వెలిశాయి. ప్రస్తుతం ఇక్కడ గజం ధర రూ.3వేల నుంచి రూ.5వేల వరకు పలుకుతోంది. కబ్జాకు గురైన ఎకరన్నర భూమి విలువ కనీసం రూ.2 కోట్లకుపైనే ఉంటుందని పలువురు చెబుతున్నారు. రియల్ వ్యాపారులకు రాజకీయ నాయకులు, అధికారుల మద్దతు ఉండడంతోనే ఈ కుంట కబ్జాకు గురైనా ఎవరూ పట్టించుకోవడం లేదు. మిగిలిన భూమిని కాపాడుకోవడానికి స్థానిక కుమ్మరి సంఘం నేతలు ఇటీవల చుట్టూ కంచె ఏర్పాటు చేసి బోర్డు పెట్టించారు. దీంతో ఉన్న కొద్ది స్థలం ఆక్రమణకు గురికాలేదు. లేదంటే కుంట మొత్తం మాయమయ్యేదని సంఘం ప్రతినిధులు అంటున్నారు.
నిజాం కాలంలో నిర్మించారు..
కుమ్మరులు ఈ కుంటలో నుంచి మట్టి తీసి కుండలు, మట్టిపాత్రలు తయారు చేసుకునేందుకు నిజాం కాలంలో ఈ కుంటను నిర్మించారు. ఇందులో ప్రభుత్వ శిఖం భూమి మూడెకరాల 10 గుంటలు దస్త్రాల్లో ఉంది. సాధారణంగా కొన్ని కుంటలు, చెరువుల్లో చౌడుభూమి కలిసి ఉండటంతో మట్టిపాత్రలు సరిగారావు. మక్తల్ పరిసర గ్రామాల కుమ్మరి కులస్థులు ఈ కుంట నుంచి అప్పట్లో ఎద్దుల బండ్లతో మట్టిని తీసుకెళ్లి ఇళ్ల వద్ద కుండలు తయారుచేసేవారు. ఇప్పటికీ ఈ కుంట మట్టితోనే పట్టణంలోని 70 కుటుంబాల కుమ్మరులు రకరకాల మట్టి పాత్రలు తయారు చేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల మక్తల్ పట్టణం విస్తరిస్తుండడంతోపాటు హైదరాబాద్- రాయచూరు రహదారికి దగ్గరలో ఉండడంతో రియల్ వ్యాపారుల కన్నుపడింది. దీంతో వారు కుమ్మరికుంట సమీప భూములు కొని కుంటను సైతం ఆక్రమించి ప్లాట్లు చేసి విక్రయించారు. 2020 మార్చిలో మక్తల్ పురపాలిక వారు కుమ్మరులకు ఎకరం స్థలం వదిలి రెండెకరాల్లో పార్కు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఎకరన్నరకుపైగా ఆక్రమణలకు గురికావడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు.
పరిరక్షించాలి..
'దస్త్రాల్లో 3 ఎకరాల 10 గుంటల భూమి ఉంది. ప్రస్తుతం అందులో సగం భూమి కబ్జాకు గురైంది. మా సంఘం ద్వారా రూ.50వేలు వెచ్చించి కంచె ఏర్పాటు చేసి బోర్డు పెట్టాం. ఈ కుంట మట్టిని మక్తల్ పట్టణంవారే కాకుండా పరిసర గ్రామాల కుమ్మరులు ఈ మట్టితో పాత్రలు చేసి ఉపాధి పొందొచ్చు. అధికారులు సర్వేచేసి మొత్తం స్థలాన్ని మా సంఘానికి అప్పగించాలి.'
- వెంకట్రాములు, మక్తల్ కుమ్మరి సంఘం అధ్యక్షుడు
భూమిని సర్వే చేస్తాం..
'కుమ్మరికుంట కబ్జాకు గురైన విషయం మా దృష్టికి రాలేదు. నేను బాధ్యతలు చేపట్టాక ఎవరూ చెప్పలేదు. సంఘం వారు సర్వే కోసం చలానా కట్టి అర్జీ పెట్టుకోవాలి. సర్వే చేయించి కుమ్మరి కుంట స్థలాన్ని పరిరక్షిస్తాం.'
- నర్సింగరావు, మక్తల్ తహసీల్దార్
- ఇదీ చదవండి : పోలీసు శాఖను వీడని పదోన్నతుల గందరగోళం