KTR Narayanapeta tour: తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్, భాజపా చేసింది ఏమి లేదని.. నీతిమాలిన జాతీయ పార్టీలతో రాష్ట్రానికి ఒరిగేది ఏమి లేదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. దిల్లీ, గుజరాత్ నేతల పార్టీలు అధికారంలోకి రావడానికి శుష్క వాగ్ధానాలు తప్ప చేసేది ఏమి ఉండదని అన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించే ఏకైన పార్టీ తెరాసనేనని.. మన ఇంటి పార్టీని గుండెల్లొ పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత ప్రజలదేనని పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో రూ.81 కోట్ల విలువైన పలు అభివృద్ధి పథకాలు ప్రారంభించి.. మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలోని మిని స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా తీసుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విభజన చట్టం సెక్షన్ 3 కింద పంపకాలు తేల్చమని, 575 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాల్సిందిగా ట్రైబ్యునల్‌కు సిఫారసు చేయమని ఎనిమిదేళ్లుగా కేంద్రానికి విఙ్ఞప్తి చేస్తున్నా చలనం లేదని మండిపడ్డారు. కేంద్రానికి తెలంగాణపై చిత్త శుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెరాస అధికారంలోకి వచ్చాక ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి ప్రాజెక్ట్‌లపై 28వేల కోట్లు ఖర్చు చేశామని, 8 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందజేశామని గుర్తు చేశారు. ఇందులో కేంద్రం పైసా కూడా ఇవ్వలేదన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ఉమ్మడి పాలమూరు అభివృద్ధి కోసం 30వేల కోట్ల నిధులు అమిత్ షా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
'ఎనిమిదేళ్లలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణకు ఏం చేయలేదు. చేసిందేమి లేకపోగా ఇక్కడికి వచ్చి పాదయాత్ర చేస్తూ దిక్కుమాలిన మాటలు, పచ్చి అబద్ధాలతో మహబూబ్‌నగర్ రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా ఇస్తామని సుష్మాస్వరాజ్ చెప్పారు. దమ్ముంటే ప్రధాని మోదీ జాతీయ హోదా ప్రకటించాలి. 14న అమిత్‌షా వస్తున్నారంటా... 500 టీఎంసీలు కేటాయిస్తూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా.' - కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి
గ్రూప్1 పరీక్షలు ఉర్దూలో రాయడాన్ని వ్యతిరేకిస్తున్న భాజపా నేతలు కేంద్రం నిర్వహిస్తున్న పోటీ పరీక్షలు ఉర్దూలో నిర్వహించడం లేదా..? అన్ని ప్రశ్నించారు. కేంద్రం గుర్తించిన అధికారిక భాషల్లో ఉర్దూ లేదా అని ఎదురుదాడికి దిగారు. మతం పేరిట పంచాయితీలు తప్ప ఆ పార్టీ నేతల వాదనలో వాస్తవాలు లేవన్నారు. కేంద్రం ఈ ఎనిమిది ఏళ్లలో వివిధ రాష్ట్రాలకు నవోదయ విద్యాలయాలు, వైద్య కళాశాలలు, ట్రిపుల్ ఐటీలు, ఐఐఎంలు మంజురు చేసినా తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా అన్నారు.
చేనేత మీద పన్ను పోటు వేసిన ఏకైన ప్రధాని మోదీ అని.. కేంద్రం మంజూరు చేసిన చేనేత సముహాల్లో తెలంగాణకు మాత్రం చోటు దక్కలేదని ధ్వజమెత్తారు. వికారాబాద్-కృష్ణా, గద్వాల-మాచర్ల రైల్వే లైన్లను ఏళ్లుగా కేంద్రం మంజూరు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తుందని ప్రచారం చేస్తున్న భాజపా నేతలు.. వాళ్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో హరితహారం, స్మశానవాటికలు, డంపింగ్‌యార్డులు ఎందుకు లేవని ప్రశ్నించారు. కేంద్రం గుర్తించిన ఉత్తమ గ్రామ పంచాయతీల్లో భాజపా పాలిత రాష్ట్రాలకు ఎందుకు చోటు దక్కలేదని ఎదురుదాడికి దిగారు.
యాభై ఏళ్లు అధికారంలో ఉన్న ప్రజలకు ఏమి చేయలేని పార్టీ నేతలు.. సొంత నియోజకవర్గం అమేథిలో పార్టీని గెలిపించుకోలేని నేతలు కూడా ఒక్క అవకాశం ఇవ్వాలంటూ తెలంగాణ ప్రజలను కోరడం హాస్యస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, చిటెం రాంమోహన్‌రెడ్డి, అల వెంకటేశ్వర రెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి : రౌడీ హీరో రాజసం.. మిడిల్ క్లాస్ టు లగ్జరీ లైఫ్.. ఆస్తుల విలువ తెలిస్తే..