నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ని గ్రామ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది, ఏఎన్ఎం కార్యకర్తలు, ఆశా వర్కర్లకు శానిటైజర్లు, పీపీఈ కిట్లు, థర్మోమీటర్లు, ఫేస్ షీల్డులు, ఎన్-95 డబుల్ లేయర్ మాస్కులు, శానిటైజర్లు సహా ఇతర సామగ్రిని శివంత్రెడ్డి అందజేశారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం రీజనల్ కో-ఆర్డినేటర్ శివంత్రెడ్డి సహకారంతో వైద్యాధికారి డా.సిద్ధప్ప, డా.తిరుపతి ఆధ్వర్యంలో ఆస్పత్రి సిబ్బందికి సుమారు రూ.లక్ష విలువ చేసే సామగ్రిని అందించారు.
యావత్ ప్రపంచాన్నే గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి బారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్య బృందం అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని శివంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ నేపథ్యంలో తమ ఆస్పత్రికి కరోనా నియంత్రణ సామగ్రి సమకూర్చిన డెవలప్మెంట్ రీజనల్ కో-ఆర్డినేటర్ రఘురాం శివంత్ రెడ్డి, ఫోరం కమిటీ అమెరికా ప్రెసిడెంట్ కవిత, ప్రీతి, మణికి ఆస్పత్రి సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.