ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నవారిని రాష్ట్రప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ఆరోపించారు. భాజపా అధికారంలోకి రాగానే తెరాస అరాచాకాలకు తగిన సమాధానం చెబుతామని బండి హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చని తెరాస నేతల్ని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నారాయణపేటజిల్లాలో 18వ రోజు ప్రజాసంగ్రామ యాత్ర ఉత్సాహంగా కొనసాగింది. కొల్లంపల్లి,లింగంపల్లి గేట్, ధన్వాడ మీదుగా మణిపూర్ తండా వరకూ పాదయాత్ర సాగింది. కొల్లంపల్లిలో మేదరి మహేంద్ర సంఘం సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారిని ఎస్టీ జాబితాలో చేర్చుతామని హమీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరు పరిశీలించి రైతు సమస్యలపై ఆరా తీశారు. తెరాస అన్నివర్గాలకు అన్యాయం చేస్తోందని మండిపడ్డ బండి సంజయ్ కోయిల్ సాగర్ ద్వారా ధన్వాడ చెరువు నింపుతామని హామీ ఇచ్చారు.
బండి సంజయ్‌తో పాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ యాత్రలో పాల్గొన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర మలిదశ ఉద్యమాన్ని తలపిస్తుందని, వచ్చే ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని లక్ష్మణ్ స్పష్టం చేశారు. కేసీఆర్ పాలన అంతానికి సమయం దగ్గర పడిందని...అందుకే ప్రశాంత్ కిషోర్‌ను వ్యూహకర్తగా నియమించుకున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
మహబూబ్‌నగర్‌లో ఈనెల 5న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకాబోయే బహిరంగసభకు భారీ జనసమీకరణ జరపాలని రాష్ట్రనాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో బండి సంజయ్ సమావేశమై జేపీ నడ్డా సభ ద్వారా జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యేలా విజయవంతం చేయాలని తీర్మానించారు.
ఇదీ చూడండి: