కొవిడ్-19 నేపథ్యంలో విద్యాశాఖ ఆన్ లైన్ తరగతులను మంగళవారం ప్రారంభించింది. నారాయణపేట జిల్లా 11 మండలాల్లోని 511 పాఠశాలలకు చెందిన 48,787 విద్యార్థులకు గాను 48,737 మంది విద్యార్థులు వివిధ మాధ్యమాల ద్వారా ఆన్ లైన్ తరగతులకు హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ తెలిపారు.
పాఠాల ప్రసారం..
విద్యాశాఖ దూరదర్శన్ యాదగిరి టీ- శాట్ కు చెందిన విద్యా ఛానల్ ద్వారా ముందుగా రికార్డు చేసిన మూడు నుంచి 10వ తరగతుల వారికి పాఠాలను ప్రసారం చేసింది. దూరదర్శన్ లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠాలను ప్రసారం చేశారు.
అవగాహన..
ఆగస్టు 27 నుంచి బడులకు వెళ్తున్న ఉపాధ్యాయులు మంగళవారం.. పలుచోట్ల గ్రామాల్లో తిరుగుతూ విద్యార్థులకు ఇళ్లకు వెళ్లి డిజిటల్ పాఠాల ప్రసారాలపై తల్లిదండ్రులకు, పిల్లలకు అవగాహన కల్పించారు. స్మార్ట్ ఫోన్లు ఉన్నవారికి టీ- శాట్ యాప్ డౌన్లోడ్ చేసి ఇచ్చారు.
యూట్యూబ్ లోనూ..
డీడీ పాఠాలను యూట్యూబ్ లోనూ చూడవచ్చని తల్లి దండ్రులకు, పిల్లలకు ఉపాధ్యాయులు సూచించారు. కొన్నిచోట్ల తల్లిదండ్రులకు డీడీ, టీ- శాట్ ఛానళ్లపై పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల విద్యుత్ కోతలు, టీవీ సిగ్నల్ సరిగా లేకపోగా.. పలుచోట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు అసంతృప్తికి లోనయ్యారు.