నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఖుదాబాక్షుపల్లి గ్రామ శివారులోని పలు సర్వే నెంబర్లలో గల సుమారు 700 ఎకరాల్లో టపాసుల తయారీ ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. శివరాత్రి చంద్రయ్య ఇండస్ట్రీయల్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ వారు బాణసంచా తయారీ ఫ్యాక్టరీని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కంపెనీలో తయారు చేసిన పటాకులను పరిశీలన నిమిత్తం ఇక్కడే పేలుస్తారనే సమాచారం ఉన్నందున గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
'ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వొద్దు'
ఫ్యాక్టరీ యాజమాని గ్రామ పంచాయతీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామస్థులు, రైతులు మాత్రం తమ గ్రామంలో ఇలాంటి బాంబుల కంపెనీ వద్దని ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. పచ్చని పంటలతో అలరారే ఈ పల్లెటూరిలో ఎక్కువ మంది వ్యవసాయం చేసుకునేవారే. వ్యవసాయంతో పాటు పశుపోషణ ఇక్కడి రైతుల వృత్తి. జంతువుల పెంపకం ఎక్కువగా ఉంటున్నందున పేలుడు పదార్థాల తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం వల్ల స్థానికంగా గాలి,నీరు కలుషితమవుతాయని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బాంబుల కంపెనీకి ప్రభుత్వం అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి : జింకల పార్కుకెళ్తే... అడవి పంది దాడి