నల్గొండ జిల్లాలో యూరియా స్టాక్ పాయింట్‌గా ఉన్న మిర్యాలగూడ నుంచి ఈ దందా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోల్‌సేల్ వ్యాపారులు తమకు అనుకూలంగా ఉన్న రిటైల్ వ్యాపారులకు మాత్రమే సరకు రవాణా చేస్తూ... అధిక ధరలకు విక్రయాలు సాగిస్తూ రైతుల వెన్నువిరుస్తున్నారు. యూరియా ఒక బస్తా ఉత్పత్తికి వెయ్యికి పైగా ఖర్చు అవుతుండగా ప్రభుత్వం సబ్సిడీ భరిస్తూ 45కిలోల యూరియా బస్తాను 266.50 రూపాయలకు రైతులకు అందిస్తుంది. రైతుల సబ్సిడీని ప్రభుత్వం నేరుగా కంపెనీలకు చెల్లిస్తుంది.
నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో మొదటి జోన్లో మూడు లక్షల ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేస్తుండగా... యూరియాకు ఇక్కడ అధికంగా డిమాండ్ ఉంది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో యూరియా అవసరం ఎక్కువగా ఉండగా యాదాద్రి జిల్లాలో తక్కువ వినియోగం ఉంది. అధికారులు మూడు జిల్లాలకు సమానంగా కేటాయిస్తుండగా ఆయకట్టు ప్రాంత రైతులకు యూరియా కొరత ఏర్పడుతుంది. ఏ ప్రాంతానికి చెందిన ఎరువుల కంపెనీల వారైనా మిర్యాలగూడకు రైల్వే వ్యాగన్లతో తీసుకువస్తున్నారు. వచ్చిన సరకులు 50% సొసైటీలకు మిగతాది వ్యాపారులకు అందిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న కొన్ని దుకణాలకే యూరియాను బ్లాక్ ధరలకు పంపుతుండగా రైతులకు 266 రూపాయలకు ఇవ్వాల్సిన యూరియా బస్తా.. రూ.360 ధరకు విక్రయిస్తున్నారు. దీంతో రైతులపై అదనపు భారం పడుతుంది. మరి కొందరు వ్యాపారస్తులు తమ వద్దనున్న ఇతర కాంప్లెక్స్ చెరువులు, జింక్ వంటివి కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామంటూ ఆంక్షలు పెడుతుండగా పెద్ద రైతులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.
మిర్యాలగూడ ఏరియాలో బోర్లు, బావుల కింద ముందుగా వేసిన పంటకు యూరియా అవసరం వస్తుండగా ఇప్పుడే వ్యాపారస్తులు కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఎకరాకు రైతులు రెండు నుంచి మూడు బస్తాల యూరియా చల్లుతుంటారు. అదే సాగర్ ఆయకట్టు (ఎడమ కాలువ) కింద వేసిన లక్షల ఎకరాల వరి పొలానికి యూరియా అవసరమైనప్పుడు రైతులు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు గోదాములను, రిటైల షాపులను తనిఖీలు చేసి ప్రభుత్వం ధరలకే యూరియా విక్రయించే విధంగా చూడాలని, యూరియాను బ్లాక్ చేసే వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చూడండి : వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం.. వసతి గృహానికీ మంటలు