నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని అద్దంకి- నార్కట్పల్లి బైపాస్ రోడ్డుపై ట్రాక్టర్ బోల్తా పడింది. పట్టణంలోని సుందర్నగర్ కాలనీకి చెందిన భవన నిర్మాణ కార్మికులు బైపాస్ రోడ్డు సమీపంలోని ఓ వెంచర్లో గృహ నిర్మాణ పనులకు వెళ్లి ఇంటికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రాక్టర్ వెళ్తున్న క్రమంలో ఇనుపరాడు కింద పడగా... కార్మికులు ఒక్కసారిగా కేక పెట్టారు. దీంతో డ్రైవర్ ఒక్కసారిగా వెనక్కు తిరిగి చూశాడు. అంతలో ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. కాంక్రీట్ మిల్లర్ యంత్రంతో కలసి ఉన్న ట్రాలీ ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాద సమయంలో 10 మంది కార్మికులు ఉండగా... డ్రైవర్ కొండలు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. వేముల పద్మ, కనకమ్మ, శిరీష, వెంకటరమణలకు గాయాలయ్యాయి. మిగతా ఐదుగురు కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రెండవ పట్టణ సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఇవీచూడండి: ఇల్లు తగలబెట్టిన ఎలుక