భాజపా మహిళా మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ స్టే ఇన్ హోటల్లో మహిళా సాధికారత, స్త్రీ రక్షణపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి భాజపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డీకే అరుణ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతిని వెలిగించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరగడానికి ముఖ్య కారణం మద్యమేనని పేర్కొన్నారు. దిశ, మానస, సమత మొదలైన ఘటనలన్నింటికీ విచ్చలవిడి మద్యం అమ్మకాలే ప్రధాన కారణమన్నారు. రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ వైన్ షాపులు పెట్టి ప్రజలను తాగుబోతులుగా సీఎం మారుస్తున్నారని విమర్శించారు.
మద్యం నిషేధించాలి...అప్పుడే స్త్రీలకు భరోసా...
బంగారు తెలంగాణ కాకముందే మద్యం తెలంగాణగా మారుతోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం మద్యం ద్వారానే వస్తోందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కి దేవాలయాలు, పాఠశాలలు, హైవే రోడ్ల వెంటే వైన్స్ షాపులు పెడుతున్నారని వివరించారు. ఇకనైనా మద్యం అమ్మకాలను అరికట్టి మహిళలకు పూర్తి భద్రత కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు, పార్టీ కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.