నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం సమీపంలో గండి పడింది. సాగర్ కాల్వకు నీటి విడుదల గత నెల జులై 28 నుంచి కొనసాగుతుంది అయితే కాల్వలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో పాటు మట్టికట్ట బలహీనం కావడంతో ఈ గండి పడినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో కాల్వలోకి 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అటుగా వచ్చిన రైతులు గండి పడడం చూసి ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
వారు జలాశయ అధికారులకు సమాచారం ఇవ్వడంతో నీటి విడుదలను ఆపేశారు. అయితే కాల్వలో ఉన్న నీరు మొత్తం గండి ద్వారానే బయటకు వెళ్లిపోవడానికి సమయం పట్టే అవకాశం ఉంది. కాల్వ కట్ట దిగువ ప్రాంతంలోని రైతులు పొలాల్లో వరి నాట్లు వేశారు. ఫలితంగా వందల ఎకరాల్లో పొలాలన్ని నీట మునిగిపోయాయి. నీటి ప్రవాహానికి వరి నాట్లు కొట్టుకుపోయే అవకాశం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరద నీరు జాతీయ రహదారి పైకి రావడంతో మిర్యాలగూడ దేవరకొండ వెళ్లే మార్గాలను పోలీసులు దారిమళ్లించారు. రహదారి నిడమనూరు మండల కేంద్రంలో ఉన్న ఎస్బీఐ బ్యాంకు, దాని పక్కనే ఉన్న గిరిజన బాలికల మినీ గురుకులంలోకి నీరు చేరడంతో ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుని అక్కడ ఉన్న విద్యార్థులను స్థానికంగా ఉన్న ఫంక్షన్ హాల్లోకి తరలించారు.
నిడమనూరులో 20 నివాసాల్లో ఉన్న ప్రజలను నర్శింహలగూడెంలో ఉన్న లోతట్టు ప్రజలను కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణా రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వరద ఉధృతి తగ్గడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. నిడమనూరు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం కాల్వకు గండిపూడ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: నిమజ్జనంపై గందరగోళం వద్దు.. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు జరుగుతున్నాయన్న తలసాని