నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు... ముఖ్య నేతలు ప్రచార హోరు కొనసాగించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి, రేవంత్ రెడ్డి, డీకే అరుణ... తమ పార్టీ అభ్యర్థుల కోసం గ్రామాలను చుట్టేశారు. త్రిపురారం, పెద్దదేవులపల్లి, బాబుసాయిపేట, ముకుందాపురం, తుమ్మడం, నారమ్మగూడెం నుంచి తిరుమలగిరి రంగుండ్ల వరకు... కిషన్ రెడ్డి రోడ్ షో సాగింది. పార్టీ అభ్యర్థి రవికుమార్‌ను వెంటబెట్టుకుని ఊరూరా ఓట్లు అడుగుతూ... తెరాస, కాంగ్రెస్ తీరును తీవ్రంగా విమర్శించారు. అనంతరం హాలియాలో పార్టీ నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేశారు. డీకే అరుణ సైతం... తమ అభ్యర్థికే ఓటు వేయాలంటూ హాలియా, అనుముల, ముక్కామల, వెంకటాద్రిపాలెం, కోసలమర్రి, అన్నారం గ్రామాల్లో ఓటర్లను కలుసుకున్నారు.
మంత్రి జగదీశ్ రెడ్డి... తిరుమలగిరితోపాటు పలు గ్రామాల్లో రోడ్ షోల్లో పాల్గొన్నారు. అభ్యర్థి నోముల భగత్... తెట్టకుంట, అల్వాల, శ్రీరాంపల్లి, కొంపెల్లి సహా వివిధ గ్రామాలు చుట్టి వచ్చారు. గుర్రంపోడు మండలంలోని ముస్లిం మైనారిటీ నాయకులతో... హోంమంత్రి మహమూద్ అలీ సమావేశమయ్యారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్... హాలియా పురపాలికలో ఇంటింటి ప్రచారం చేశారు. తన తండ్రి గెలిచిన స్థానాన్ని తిరిగి తనకే కట్టబెట్టాలని ఓటర్లను నోముల భగత్ అభ్యర్థించారు.
పెద్దవూర మండలం పులిచర్లతోపాటు తిరుమలగిరి, డొక్కబాయి తండాలో... జానారెడ్డితో కలిసి రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లలో ఎవరిని పంపించినా... జానారెడ్డి చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. నగదు, మద్యం పంపిణీతో తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ... ఎన్నికల పరిశీలకునికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి పోలీసులు సహకరిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నా ఎక్కడా తనిఖీలు జరగడం లేదని... పారదర్శకంగా ఎన్నిక నిర్వహించడంలో ఈసీ వైఫల్యం చెందిందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన తెరాస, కాంగ్రెస్, భాజపా నాయకులపై... మరోసారి కేసులు నమోదయ్యాయి. కిషన్ రెడ్డి కాన్వాయ్‌కి సంబంధించి ఆ పార్టీ నాయకుడిపై నిడమనూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మంత్రి జగదీశ్‌రెడ్డి కాన్వాయ్‌కి సంబంధించి ఆ పార్టీ నేతపై తిరుమలగిరి సాగర్ ఠాణాలో... రేవంత్ కాన్వాయ్‌కి సంబంధించి కాంగ్రెస్ నేతపై కేసులు నమోదయ్యాయి. కాన్వాయ్‌లో 5 వాహనాలకే అనుమతి ఉండగా... దాన్ని ఉల్లంఘించడం, దూరం పాటించకపోవడంతో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిడమనూరుకు చెందిన కాంగ్రెస్ నాయకుడి ఇంటిపై దాడి చేసిన పోలీసులు... 4 లక్షల 81 వేల నగదు, 96 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: రక్తపాతం మధ్య బంగాల్ నాలుగో విడత పోలింగ్