భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay tour) పర్యటన నేపథ్యంలో నల్గొండలో ఉద్రిక్తత నెలకొంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని శెట్టిపాలెం వద్ద... భాజపా, తెరాస శ్రేణుల పరస్పర దాడుల నడుమ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వందలాదిగా తరలివచ్చిన జనం మధ్యన... ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. బండి సంజయ్ వెనక్కి వెళ్లాలంటూ తెరాస శ్రేణుల నినాదాలు చేశారు. తెరాస, భాజపా కార్యకర్తల పోటాపోటీ నినాదాలు చేశారు. రహదారిపై బైఠాయించి భాజపా శ్రేణులు ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో తెరాస శ్రేణులు నిరసనకు దిగారు.
పోలీసుల నిర్లక్ష్యం..
ముఖ్యంగా పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడింది. తెరాస శ్రేణులకు బండి సంజయ్కు 20 మీటర్ల దూరం కూడా లేకపోవడం... పరిస్థితికి అద్దం పట్టింది. ఇదే అదనుగా తెరాస శ్రేణులు... నల్ల జెండాలతో నిరసన చేపట్టి కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. ఆగ్రహించిన భాజపా కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు.
అడుగడుగునా అడ్డగింతే..
అనంతరం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మం. చిల్లేపల్లిలో బండి సంజయ్ పర్యటన కొనసాగుతుండగా.. మార్గంలో తెరాస శ్రేణుల నిరసనకు దిగారు. మూసీ వంతెనపై బైఠాయించి తెరాస శ్రేణుల నినాదాలు చేశారు. బండి సంజయ్ వెనక్కి వెళ్లాలని తెరాస కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మిర్యాలగూడ నుంచి చిల్లేపల్లి మీదుగా బండి సంజయ్ గడ్డిపల్లి వెళ్లనున్నారు.
అంతకు ముందు..
ఆర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని బండి సంజయ్(Bandi sanjay in nalgonda) సందర్శిస్తుండగా... తెరాస కార్యకర్తలు నల్ల జెండాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ తెరాస శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. తెరాస శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. తెరాస శ్రేణులపైకి దూసుకెళ్లేందుకు భాజపా కార్యకర్తలు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. 'పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నార'ని భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఐకేపీ కేంద్రంలో తెరాస, భాజపా శ్రేణులు(trs vs bjp) పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. ఈ ఉద్రిక్తతల మధ్యే ఐకేపీ కేంద్రంలోని ధాన్యం రాశులను బండి సంజయ్ పరిశీలిస్తున్నారు.
రాళ్ల దాడికి సిద్ధమేన్న బండి
ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr) బాధ్యతను మరచి మాట్లాడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay comments) ఆరోపించారు. సీఎం కేసీఆర్ గజినీ వేషాలు మానుకోవాలని అన్నారు. పండిన ప్రతి గింజా కొంటానని సీఎం గతంలో చెప్పారని... సమస్య పరిష్కరించకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలంలో పంట మొత్తం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. పంటలన్నీ కేంద్రం కొనుగోలు చేస్తే సీఎం ఏం చేస్తారని ప్రశ్నించారు. రైతులకు దసరా, దీపావళి లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారని... ధాన్యం మొలకలు వస్తోందని అన్నారు. తెరాస కార్యకర్తలు రైతుల్లాగా వచ్చి గొడవ చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. రైతులపై రాళ్లు, కోడిగుడ్లు వేస్తారా? అని నిలదీశారు. శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోసం రాళ్ల దాడికి సిద్ధమేనని స్పష్టం చేశారు.
బండి పర్యటన ఎందుకు?
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం, రాష్ట్రం మధ్య నెలకొన్న అస్పష్ట వాతావరణం నడుమ... నేరుగా రైతుల కష్టాలు తెలుసుకునేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) చేపట్టిన పర్యటన సాగర్ ఆయకట్టు పరిధిలో కొనసాగనుంది. తొలిరోజైన ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రం నుంచి మొదలై... సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వరకు కొనసాగనుంది. సాగర్ ఎడమ కాల్వ కింద నల్గొండ, మిర్యాలగూడ, నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్, కోదాడ వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో... భారీగా పంట సాగవుతుంటుంది. కానీ కొన్ని సీజన్ల నుంచి ధాన్యానికి మద్దతు ధర దక్కడం లేదు. అయితే వచ్చే యాసంగి నుంచి ధాన్యం కొనుగోళ్లు ఉంటాయా, ఉండవా అన్న మీమాంస నడుమ... భాజపా, తెరాస మధ్య నెలకొన్న మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలకు దిగుతూ... కొనుగోలు బాధ్యత మీదంటే మీదంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో... రైతులు అవస్థలు పడుతున్న ప్రాంతాల్లోనే సంజయ్ (state bjp president) పర్యటన సాగబోతోంది. ఇందుకోసం ఆ పార్టీ శ్రేణులు... అధ్యక్షుడి రాక కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.