ట్రాలీలో కూరగాయలు తీసుకెళ్తున్న ఈయన నల్గొండ జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామరైతు తాటికొండ రాములు. ఆయన తనకున్న పొలంలో ఎప్పట్నుంచో కూరగాయలు సాగుచేస్తున్నారు. వాటిని విక్రయించే క్రమంలో మునుగోడు మండల కేంద్రానికి తీసుకెళ్లేందుకు ఆటోలను ఆశ్రయించేవారు.
ఒక్కోసారి సమయానికి ఆటోలు దొరక్క రోడ్డుపై పడిగాపులు కాసేవారు. ధర లేనప్పుడు వాటిని అమ్మగా వచ్చే సొమ్ము రవాణా ఖర్చులకే సరిపోయేవి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనుకున్న ఆయన, రూ.20 వేలు వెచ్చించి తన ద్విచక్రవాహనానికి అమర్చేలా ట్రాలీ తయారుచేయించుకున్నారు. ప్రస్తుతం సుమారు 200 కిలోల సరకును మార్కెట్‌కు సులువుగా తెచ్చుకోగలుగుతున్నానని ఎరువులు, ఇతరత్రా వస్తువులను తీసుకెళ్లేందుకూ ఇది ఉపయోగపడుతోందని రాములు తెలిపారు.