Sagar Left Canal works: సాగర్ ఎడమ కాలువ గండి పనులు నత్తనడకన సాగుతున్నాయి. వారం రోజులు గడుస్తున్నా గండిపడిన ప్రాంతంలో పూడ్చివేత పనులు నెమ్మదిగా సాగిస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా నీరు అందక వరినాట్లు కొన్నిఎండిపోయాయి. గండి పడిన ప్రాంతంలో పనులు మొదట్లో చురుగ్గా సాగినా.. ఇప్పుడు నత్తనడకన సాగుతున్నాయని రైతులు వాపోతున్నారు.
ఇది ఇలానే కొనసాగితే వరి నాట్లు వేసిన పొలాల్లో బీటలు వచ్చి ఎండిపోయే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో అధికారులు వారం రోజుల్లో గండి పూడ్చి సాగు నీరు విడుదల చేస్తామని చెప్పారు. పనులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటి వరకు కాలువ గండి పనులు అడుగు భాగం మాత్రమే నల్లమట్టిని నింపి రోలర్లతో తొక్కించారు.
ఇంకా ఎర్ర మట్టి నింపి ఇసుక బస్తాలతో 45 మీటర్ల మేరకు కాలువ కట్టకి మట్టిని నింపాల్సి ఉంది. ఇంకా పనులు మొత్తం పూర్తి అయ్యేసరికి మరొక వారం రోజులు పట్టే అవకాశం ఉంది. అధికారులు మాత్రం మరో నాలుగు రోజుల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పుకొస్తున్నారు.
ఇవీ చదవండి: