మొక్కలు నాటాలంటే ఖాళీ స్థలం కావాలి. ఇది చాలా మంది మదిలో మెదిలే ప్రశ్న. కానీ పచ్చదనానికి కావాల్సింది ప్రశ్నలు కాదు. ఆచరణాత్మక ధోరణి అని నిరూపిస్తున్నారు నల్గొండకు చెందిన సబీహబాను. తన ఇంటి పైకప్పుపైనే నాలుగు వందల వరకు మొక్కలు నాటి... ప్రకృతి పట్ల ప్రేమను కనబరుస్తున్నారు. వాడిపడేసే వస్తువుల్ని వృథా కానీయకుండా... వాటిని అందంగా అలంకరించి మొక్కల కోసం ఉపయోగిస్తున్నారు. సబీహబాను 1981లో బీఎస్సీ పూర్తి చేశారు. ఒకే ఏడాది... ఆమె భర్తతోపాటు తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు. కన్నవారు, కట్టుకున్నవాడు విడిచి వెళ్లిపోవడంతో... ఆ బాధను తట్టుకోలేక సబీహ తీవ్రంగా కుంగిపోయారు.
ప్రకృతి ప్రేమికురాలు
తనకు ఏమీ లేదన్న ఆత్మన్యూనతకు లోనవడంతో... కుటుంబ సభ్యులకు కూడా ఏమీ తోచలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె... ఒక చోట భవనంపై నాటిన మొక్కల్ని చూశారు. పచ్చదనం పెంపొందించేందుకు తాను కూడా ఏదో ఒకటి చేయాలనుకున్నారు. చివరకు తన భవనాన్నే అందుకు వేదిక చేసుకున్నారు. ఎక్కడ మొక్కలు కనపడ్డా వాటిని తీసుకురావడం... భవనంపై నాటడం చేస్తుండేవారు. అలా అదే వ్యాపకంగా మారి... వందల మొక్కల్ని నాటే వరకు తీసుకువెళ్లింది. రోజూ ఉదయం, సాయంత్రం వాటికి నీళ్లు పట్టటం, కలుపు తీయడం వంటివన్నీ స్వయంగా చేసుకుంటున్నారు.
సబీహ... స్వయంగా ఇంట్లోనే వర్మికంపోస్టు తయారు చేస్తున్నారు. బెస్ట్ ఫ్రం వేస్ట్ అనే సిద్ధాంతంతో వాడిపడేసే కూరగాయల తొక్కలు, ఇతర ఆహార పదార్థాలను అందుకు వినియోగిస్తున్నారు. అందరూ చెత్తను బయటపడేస్తే... సబీహ మాత్రం తన ఇంట్లోని చెత్తతోనే ఎరువును తయారు చేసుకుంటున్నారు. మరోవైపు వాడిపడేసిన నీటి సీసాలు, పాల ప్యాకెట్లు, సంచులను భద్రంగా దాచుకుని... వాటిలోనే మొక్కలు నాటుతున్నారు.
ఒకరకంగా సబీహబానుకు... ఇంటి పైకప్పుపైన గల పచ్చదనమే ప్రాణంగా మారింది. ఎక్కడికో పార్కులకు వెళ్లి ప్రశాంతత పొందడం కాదు... తలచుకుంటే ఎవరి ఇంటిలో వారు ప్రకృతిని పెంపొందించుకోవచ్చని ఆమె చెబుతున్నారు.
ఇదీ చదవండి: పరిమితి సమయాల్లోనే హైదరాబాద్ మెట్రో సేవలు