విపరీతమైన పంట కోతలతో పెద్ద ఎత్తున ధాన్యం వస్తున్న తరుణంలో... నల్గొండ జిల్లా మిర్యాలగూడ మిల్లర్లు రెండ్రోజుల పాటు మిల్లులను మూసివేస్తున్నారు. ఈ సోమ, మంగళవారాల్లో ధాన్యం తీసుకురావొద్దని చెబుతున్నారు. ఇప్పుడు కోతలు చేపట్టి మూడ్రోజుల తర్వాత తెచ్చే ధాన్యం రంగు మారే ప్రమాదమున్నందున... వరి కోతలు నిలిపివేయాలంటున్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న యంత్రాల వల్ల ఇబ్బడిముబ్బడిగా సరకు వస్తోందన్న ఉద్దేశంతో... వాటి కట్టడికి అధికారులు ప్రతి ఆదివారం వరికోత విరామం ప్రకటించారు.
ఆదివారం విరామం సోమ, మంగళవారాల్లో మిల్లుల మూత వల్ల... వరుసగా మూడు రోజుల పాటు ధాన్యం కోతలు నిలిచిపోనున్నాయి. మిర్యాలగూడ మిల్లులకు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచే కాకుండా... వాటి పక్క జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ధాన్యం వస్తోంది. 2 నుంచి 3 వేల ట్రాక్టర్లు కొనుగోలు చేసే సామర్థ్యమున్న పరిస్థితుల్లో... రోజుకు 10 వేల వాహనాలు బారులు తీరుతున్నాయి. అన్ని మిల్లులు పూర్తి సామర్థ్యాన్ని చేరుకున్నందున... సర్దుబాటు చేసే వరకు ధాన్యం తేవొద్దని సూచిస్తున్నారు.
నల్గొండ జిల్లాలో 2 వేల హార్వెస్టర్లు... వరికోత చేపడుతున్నాయి. ఇందులో జిల్లాకు చెందినవి 834 ఉండగా, మిగతావి బయటి ప్రాంతాల నుంచి తీసుకువచ్చారు. ఎడాపెడా చేపడుతున్న కోతలతో... వేలాది ట్రాక్టర్లు అవసరమవుతున్నాయి. సన్న బియ్యం పరిస్థితే ఇలా ఉంటే... ఇక కొనుగోలు కేంద్రాల్లో తీసుకునే దొడ్డు బియ్యాన్ని ఎలా తీసుకోవాలని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా ఈసారి... సన్నాలు, దొడ్డు బియ్యం కలిపి 20 లక్షల మెట్రిక్ టన్నులపైనే దిగుబడులు రానున్నాయి. మొత్తం మూడు వందల మిల్లులకు గానూ మిర్యాలగూడలో చిన్నవి, పెద్దవి కలిపి 180, సూర్యాపేట జిల్లాలో 61, యాదాద్రి భువనగిరి జిల్లాలో 34 ఉన్నాయి. సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోని మిల్లులు... ఐకేపీ, పీఏసీఎస్, వ్యవసాయ మార్కెట్లు కొనే దొడ్డు ధాన్యానికే సరిపోతాయి.
సన్నధాన్యం విక్రయాల కోసం... ఆయా జిల్లాల్లోని సాగుదారులంతా మిర్యాలగూడనే ఆశ్రయిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మిర్యాలగూడ మిల్లల వద్ద... భారీ స్థాయిలో ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. అయితే వరుసగా మూడు రోజులు విరామం రావడం వల్ల... పంటకు నష్టం వాటిల్లే అవకాశముందని కర్షకులు అంటున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధి మొదటి జోన్లో ఉన్న మిర్యాలగూడ ప్రాంత రైతులు... వారం నుంచి వరి కోతల్ని వేగవంతం చేశారు. ఇప్పటికే హార్వెస్టర్ల యజమానులతో ఒప్పందం చేసుకుని... యంత్రాలకు డబ్బులు కూడా చెల్లించారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా సెలవులు ప్రకటించడం ఇబ్బందికరమేనంటున్నారు. మర ఆడించిన మిల్లులకు మరమ్మతులు చేపట్టే ఉద్దేశంతోనే సోమ, మంగళవారాల్లో సరకు తేవొద్దని మిల్లర్లు చెప్పడం వల్ల అధికారులు సైతం ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది.
ఇదీ చూడండి: ఫిజీషియన్లే నిజమైన హీరోలు: గవర్నర్ తమిళిసై