నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో తమ ఖాతాలో ప్రభుత్వం జమచేసిన రూ.1500 డ్రా చేసుకోవడానికి వెళ్లిన ఖాతాదారులకు చుక్కెదురైంది. పాత అప్పు, పంట రుణాల కింద జమ చేసుకుంటున్నామని నగదు ఇవ్వకుండా ఖాతాదారులను ఆంధ్రాబ్యాంకు మేనేజర్ ఇబ్బందులకు గురిచేశారు.
అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య వద్ద బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. ప్రజలకు నిత్యావసరాలకు ఇచ్చిన డబ్బును ఎట్టి పరిస్థితుల్లో వారికి అందజేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే అక్కణ్నుంచి వెళ్లిపోయాక నగదు ఇవ్వడానికి బ్యాంకు సిబ్బంది మొండికేశారు. పై అధికారుల నుంచి డబ్బు ఇవ్వకూడదని ఆదేశాలున్నాయని చెప్పగా ఖాతాదారులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి ఈ కష్టసమయంలో తమను ఆదుకోవాలని కోరారు.