మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ పరువు హత్య కేసు విచారణ... నల్గొండలోని ఎస్సీ, ఎస్టీ కేసుల అత్యాచారాల నిరోధక చట్టం ప్రత్యేక కోర్టులో సాగింది. ప్రాసిక్యూషన్ మోపిన అభియోగాలపై అభ్యంతరాలున్నాయని... నిందితుల తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి విన్నవించారు. అంతకుముందు ఇంఛార్జి న్యాయమూర్తి ఎం.నాగరాజు... డిఫెన్స్ న్యాయవాదుల అభ్యంతరాలను రాతపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించారు.
మధ్యాహ్నం తిరిగి కేసు విచారణ చేపట్టిన కోర్టు... నిందితుల పిటిషన్లను తోసిపుచ్చి, వాటిని ఆమోదించబోమని కొట్టిపారేసింది. హత్య కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్ సమర్పించిన దస్త్రాల్లో ఇంతవరకు నిందితులకు ఇవ్వని వాటిని... వారి తరఫు న్యాయవాదులకు అందజేసింది. నిందితులు మారుతీరావు, సుభాష్ శర్మ, అస్ఘర్ అలీ, అబ్దుల్ బారీ, కరీం, శ్రవణ్ కుమార్, శివ, నిజాంను కోర్టులో హాజరుపరచగా... ప్రాసిక్యూషన్ మోపిన అభియోగాలపై విచారణ చేపట్టేందుకు కేసును మార్చి 3కు వాయిదా వేసింది.
ఇవీ చూడండి: నాకు గర్వకారణంగా ఉంది: కేటీఆర్