నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే వారి కోసం... ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం అధికార యంత్రాంగం... 15 రోజుల క్రితమే ప్రక్రియ ప్రారంభించింది. వికలాంగులు, కొవిడ్ బాధితులు, 80 ఏళ్లు దాటినవారు ఈ ఉపఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునేలా... ఈసారి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. సాగర్ నియోజకవర్గంలో ఈ తరహా ఓటర్లు... 8 వేల మంది ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు సిద్ధమైన వారి జాబితాను... గత వారం రోజుల పాటు బూత్ స్థాయి అధికారుల ద్వారా సేకరించారు. మొత్తం ఏడు మండలాల పరిధిలో 8 వేల మంది ఉంటే... అందులో 14 వందల 33 మంది పోస్టల్ బ్యాలెట్‌కు అంగీకారం తెలిపారు. ఇంటింటికీ తిరిగి బ్యాలెట్ పత్రాల్ని సేకరిస్తున్న అధికారులు... ఈ నెల 14 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. మూడో కేటగిరీ అయిన కొవిడ్ బాధిత ఓటర్ల సంఖ్య ఒక్కటి కూడా నమోదు కాలేదు.
తహసీల్దార్ నేతృత్వంలో...
పోస్టల్ బ్యాలెట్‌కు అంగీకరించిన వారి నుంచి పత్రాలు తీసుకునేందుకు... 15 బృందాలు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఇద్దరు పోలింగ్ అధికారులు, కానిస్టేబుల్, సూక్ష్మ పరిశీలకుడు, వీడియోగ్రాఫర్ ఉన్నారు. ఒక్కో బృందం రోజుకు గరిష్ఠంగా... 50- 60 మంది నుంచి బ్యాలెట్ పేపర్లు తీసుకుంటోంది. ఈ బృందాలకు తహసీల్దార్లు నేతృత్వం వహిస్తున్నారు. 12-డి పత్రంపై సంతకం చేసిన 14 వందల 33 మంది ఓటర్ల నుంచి పోస్టల్ బ్యాలెట్లు సేకరిస్తారు. చిరునామాల ఆధారంగా ఓటర్ల ఇంటికి వెళ్లి ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఒకటి రెండుసార్లు సదరు ఓటరు అందుబాటులో లేని పక్షంలో... మూడోసారి సైతం వారి నివాసాలకు వెళ్లి ఓటు వేయిస్తారు. ఓటర్ల సంఖ్యను బట్టి తిరుమలగిరి(సాగర్), అనుముల మండలాలకు నాలుగు చొప్పున బృందాల్ని పంపగా.. పెద్దవూర, త్రిపురారం మండలాలకు రెండేసి చొప్పున, గుర్రంపోడు, నిడమనూరు, మాడుగులపల్లి మండలాలకు ఒక్కో బృందాన్ని కేటాయించారు.
తిరుమలగిరిలో అత్యధికం...
పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల సమాచారాన్ని అధికారులు... ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు అందించారు. ఆసక్తి గల పార్టీల ప్రతినిధులు ఓటు వేసే ప్రక్రియను... దూరం నుంచి పరిశీలించవచ్చు. తిరుమలగిరి(సాగర్‌లో) అత్యధికంగా 408 మంది... మాడుగులపల్లిలో అత్యల్పంగా 73 మంది ఓటర్లు ఉన్నారు. అయితే పార్టీల ప్రతినిధులు ఓటర్ల వద్దకు వచ్చి ప్రలోభాలకు గురిచేయకుండా ఉండేందుకు... ఎన్నికల అధికారులు పోలీసుల సమక్షంలో ఓట్లు వేయిస్తున్నారు. అంగీకారం తెలిపిన ఓటర్లంతా ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టల్ బ్యాలెట్ ద్వారానే ఓటు వేయాల్సి ఉంటుంది. 12-డి పత్రంపై సంతకం పెట్టిన వారిలో కొంతమంది... నిరాసక్తత కనబరుస్తున్నారు. తాము నేరుగా ఓటు వేస్తామని అధికారులకు విన్నవిస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్‌కు ఒకసారి అంగీకరించిన తర్వాత... పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేస్తామంటే ఎన్నికల సంఘం అనుమతించబోదు.
మండలం | వికలాంగులు | 80 ఏళ్లు పైబడ్డవారు | మొత్తం ఓటర్లు |
గుర్రంపోడు | 46 | 45 | 91 |
పెద్దవూర | 42 | 109 | 151 |
తిరుమలగిరి(సాగర్) | 228 | 180 | 408 |
అనుముల | 229 | 139 | 368 |
నిడమనూరు | 44 | 72 | 116 |
త్రిపురారం | 122 | 104 | 226 |
మాడుగులపల్లి | 54 | 19 | 73 |
మొత్తం | 765 | 668 | 1433 |